పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి... శుక్ర, శనివారాల్లో ఏమి జరిగిందంటే..?
ఇంటర్ బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న వ్యక్తి కలవడానికి రమ్మని చెప్పి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
By: Tupaki Desk | 20 Oct 2024 5:00 AM GMTప్రేమోన్మాది దాడిలో ఓ బాలిక బలైంది. ఇంటర్ చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ బలవంత పెడుతున్న ఓ వంట మాస్టర్.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అప్పటికే వివాహం అయిన అతడి భార్య గర్భిణి కాగా.. 16 ఏళ్ల బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. జీవితంలో ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న బాలిక జీవితాన్ని బూడిద చేశాడు!
వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో శనివారం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న వ్యక్తి కలవడానికి రమ్మని చెప్పి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో ఆమెను కడప రిమ్స్ కు తరలించారు. అయితే.. సుమారు 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది.
అవును... వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని (16) మృతి చెందింది. కడమ రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మరణించింది. ఇప్పటికే ఈ ఘటనలోని నిదితుడు విఘ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప రిమ్స్ లో బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు.
తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనె విఘ్నేష్ నిప్పంటించినట్లు బాలిక తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిందితుడి కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడ్డారు. ఈ సమయంలో వారు తీవ్రంగా గాలిస్తుండగా.. రాత్రి వేళ ఓ బృందానికి నిందితుడు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... బాధిత బాలిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోందని తెలిపారు. అయితే.. కడపలోని ఓ హోటల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న విఘ్నేష్ తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి అప్పటికే వివాహం కాగా.. భార్య గర్భిణి అని చెప్పారు!
అయితే.. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసిన విఘ్నేష్.. శనివారం కలవాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో.. కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరింది ఆ బాలిక. ఈ సమయంలో మధ్యలో ఆ ఆటోలో ఎక్కాడు విఘ్నేష్. ఈ క్రమంలో... ఇద్దరూ పది కి.మీ. దూరంలో ఉన్న పీపీకుంట చెక్ పోస్ట్ వద్ద దిగారు.
అనంతరం సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. ఈ సమయంలో.. బాలికపై పెట్రోలి పోసి నిప్పటించిన విఘ్నేష్ అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో... ఇది గమనించిన కొంతమంది మహిళలు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా కాలిన గాయలతో ఉన్న ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
ఈ సమయంలో... సుమారు 80శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాలిక ఆదివారం మృతి చెందింది. అంతక ముందే న్యాయమూర్తి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు!