జనసేనకు పీ గన్నవరం...మహాసేన గరం గరం...!
మహాసేన రాజేష్ టీడీపీ అధినాయకత్వం మీద మండిపోతున్నారు. సీటు ఇచ్చినట్లే ఇచ్చి తీసుకుంటారా అని విమర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 18 March 2024 4:19 AM GMTమహాసేన రాజేష్ టీడీపీ అధినాయకత్వం మీద మండిపోతున్నారు. సీటు ఇచ్చినట్లే ఇచ్చి తీసుకుంటారా అని విమర్శిస్తున్నారు. టీడీపీ తన మొదటి జాబితాలో మహాసేన రాజేష్ కి తూర్పు గోదావరి జిల్లా పీ గన్నవరం టికెట్ ని ప్రకటించింది. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల జనసేన వర్గాలు రగిలిపోయాయి. గతంలో పవన్ ని ఆయన దారుణంగా విమర్శించారని అలాంటి నేతకు తాము మద్దతు ఇవ్వమని ఆందోళనలు చేశాయి.
అంతే కాదు ఆ సీటుని ఆయనకు ఇవ్వవద్దు అని కూడా టీడీపీ అధినాయకత్వాన్ని డిమండ్ చేశాయి. ఇంకో వైపు కొన్ని ఇతర సామాజిక వర్గాలు కూడా రాజేష్ మీద విమర్శలు గుప్పించాయి. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ టీడీపీని కోరాయి. ఇవన్నీ ఇలా ఉండగానే రాజేష్ మీడియా ముందుకు వచ్చి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.
దాంతో ఆయన ఎన్నికలకు దూరం అని అంతా అనుకున్నారు. ఇపుడు చూస్తే ఆయన ఇంకా రేసులోనే ఉన్నాను అని అంటున్నారు. తనకు సీటు లేదని చంద్రబాబు ఎక్కడా చెప్పకుండానే పీ గన్నవరం సీటుని జనసేనకు ఇవ్వాలనుకోవడం దారుణం అని అంటున్నారు.
పీ గన్నవరంలో ఐవీఆర్ ఎస్ కాల్స్ పేరుతో సర్వేలు చేయిస్తున్నారని జనసేనకు సీటు ఇవ్వబోతున్నారని ఆయన ఫైర్ అవుతున్నారు. నాకు సీటు ఇచ్చి మరీ ఈ టార్చర్ ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను ఈ రోజుకీ పీ గన్నవరం టీడీపీ ఇంచార్జిగా ఉన్నాను అని గుర్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు తనకు సీటు లేదు పక్కన ఉండు అని చెప్పేంతవరకూ ఆగరా అని ఆయన జనసేన మీద మండిపడుతున్నారు.
ఇదంతా తనను అవమానించడమే అని అంటున్నారు. బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేన అభ్యర్ధిని పెట్టామని ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి కదా ఏమిటిది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం వరకూ తాము ప్రశాంతంగా ఉన్నానని సీటు ఇచ్చి ఇపుడు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
అయినా మహాసేన రాజేష్ సీటు ఒక్కటేనా జనసేనకు కావాల్సి వచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన విషయంలో సీటు ఇవ్వట్లేదా ఏమిటి అన్నది చంద్రబాబు చెబితేనే తప్ప తాను తప్పుకోను అన్నట్లుగా మహాసేన రాజేష్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే పీ గన్నవరం సీటుని జనసేనకు ఇస్తున్నారు అని అర్ధం అవుతోంది. మరి అక్కడ మహాసేన రాజేష్ టీడీపీ ఇంచార్జ్ గా గరం గరం అవుతున్నారు అంటే ఏ విధంగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.