Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు!... మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు!

నాగలాండ్ కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్... రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 1:20 PM GMT
రాహుల్  గాంధీపై హత్యాయత్నం కేసు!... మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు!
X

బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తోన్న వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలు గందరగోళానికి దారి తీశాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీపై బీజేపీ కేసు పెట్టింది!

అవును... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పై భారతీయ జనతా పార్టీ కేసు పెట్టింది. ఈ సందర్భంగా స్పందించిన భారతీయ జనతా పార్టీ నేత అనురాగ్ ఠాకూర్... తమ పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. దాడి చేయడం, దాడికి ప్రేరేపించారని చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.

ఈ సమయంలో... బీ.ఎన్.ఎస్. సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 తో పాటు సెక్షన్ 109 హత్యాయత్నం, సెక్షన్ 117 కింద ఫిర్యాదు చేసినట్లు తెలిపారు! ఇదే సమయంలో.. ఇలాంటి వైఖరి ఆమోదయోగ్యం కాదని.. నేరపూరితమైంది కూడా అని.. అందుకే తామంతా వచ్చి ఫిర్యాదు చేశామని.. మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు.

కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు!:

ఎన్డీయే ఎంపీలను కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ వెలుపలకి నెట్టారనే బీజేపీ వాదనలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. తాను ఎవరినీ నెట్టేసే స్థితిలో లేనని.. తమపై బలవంతంగా దాడి చేశారని.. రివర్స్ లో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు అని విమర్శించారు.

ఇదే సమయంలో.. ఇది రాహుల్ గాంధీ చిత్తశుద్ధిని దురుద్దేశపూర్వకంగా కించపరిచే యత్నమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట జరుగుతుంటే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందని అన్నారు. అధికార పక్ష ఎంపీల కారణంగానే తమకు గాయాలయ్యాయంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు!

స్పీకర్ ఓం బిర్లాకు లేఖ!:

మరోపక్క.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో... రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీలు భౌతికంగా హింసించారని.. దీనిపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని.. ఇది ప్రతిపక్ష నేతకు ఉన్న అధికారాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అని లేఖలో పేర్కొన్నారు.

రాహుల్ పై మహిళా ఎంపీ కీలక ఆరోపణలు!:

పార్లమెంట్ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలు తీవ్ర గందరగోళానికి దారి తీసిన నేపథ్యంలో నాగలాండ్ కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్... రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశారని అన్నారు.

ఫ్లకార్డు పట్టుకుని తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాహుల్ గాంధీ తనకు సమీపంగా వచ్చారని.. తనపై అరిచారని.. అనుచితంగా ప్రవర్తించారని.. దీంతో.. ఒక మహిళగా తాను ఎంతో అసౌకర్యానికి గురయ్యానని.. ఆయన ఈ విధంగా ప్రవర్తించి ఉండకూడదని అన్నారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు!