ట్రంప్ గెలుపుతో మన ఫార్మా రంగానికి కొత్త ఊపు
రానున్న రోజుల్లో అమెరికాకు మన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి ఎక్కువ అవుతుందని.. ఇది దేశీయ ఫార్మా పరిశ్రమలకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 24 Nov 2024 4:51 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో మన దేశంలోని వివిధ రంగాల మీద పడే ప్రభావాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని ప్రతికూల అంశాలు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. అయితే.. అన్ని నెగిటివ్ అంశాలే కాదు. కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు దేశీయ ఫార్మా రంగం ఒకటన్న మాట వినిపిస్తోంది. ట్రంప్ గెలుపు.. దేశీయ ఫార్మా రంగానికి కొత్త శక్తిని ఇస్తుందన్న వాదనను పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రానున్న రోజుల్లో అమెరికాకు మన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి ఎక్కువ అవుతుందని.. ఇది దేశీయ ఫార్మా పరిశ్రమలకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
జనరిక్ ఔషధాల ఉత్పత్తి.. ఎగుమతుల్లో మన దేశం ఇప్పటికే దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రపంచ దేశాలకు కొవిడ్ పెద్ద గుణపాఠాల్ని నేర్పింది. అన్నింటికి చైనా మీద ఆధారపడితే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని వారు నేరుగా చూశారు. కొన్ని కీలక రంగాల్లో చైనా మీదనే పూర్తిగా ఆధారపడకుండా.. చైనా + వన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంటే.. తమ కీలక దిగుమతులకు సంబంధించి చైనాతో పాటు తమకు అనువుగా ఉండే మరో దేశాన్ని ప్రోత్సహించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం.
జనరిక్ మందుల విషయంలో చైనా మీదనే పూర్తిగా ఆధారపడకుండా.. ఔషధ ముడి పదార్థాల విషయంలోనూ చైనా మీదనే పూర్తిగా ఆధారపడకుండా.. ఇతర దేశాల నుంచి సమీకరించేలా ప్లాన్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే.. యూఎస్ బయో సెక్యూర్ యాక్టును ప్రతిపాదించారు. దీని ప్రకారం అమెరికా కంపెనీలు స్థానికంగా ఔషధాలు తయారు చేసేలా ప్రోత్సహించటమే దీని లక్ష్యం. ఈ చట్టం కానీ అమల్లోకి వస్తే అమెరికా కంపెనీలు చైనాలో బయోటెక్.. బయోలాజికల్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం తగ్గిపోతుంది.
అదే జరిగితే.. మన దేశంతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే వీలుంటుంది. దీనికి తోడు ట్రంప్ విజయం సాధించటం.. ఆయన చేతికి అధికార పగ్గాలు రావటం కూడా భారతదేశానికి సానుకూల అంశంగా భావిస్తున్నారు. దీనికి కారణం.. తాను దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన మొదటిసారి చైనా వ్యతిరేక విధానానికి తెర తీశారు ట్రంప్. అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఎంచుకుంటూ.. చైనాపై ఆంక్షలతో పాటు.. ఆ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై పన్నులు విధించారు. తాజాగా అధికారం చేపట్టిన తర్వాత పాత విధానాన్నే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అదే జరిగితే.. చైనా ఫార్మాతో పోలిస్తే.. మన ఫార్మా కంపెనీలు మరింత తక్కువ ధరల్లో ఔషధాల్ని అందించే వీలుంది. ఇది మనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే మన ఔషధ ఎగుమతుల్లో 33 శాతం అమెరికాకే వెళుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే వీలుంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి సుమారు రూ.2.35 లక్షల కోట్లు విలువైన ఔషధాలు వివిధ దేశాలకు ఎగుమతి కాగా.. అందులో 33 శాతం అమెరికాకే వెళ్లటం గమనార్హం. 2016-17లో మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతైన ఔషధాలు 16.8 బిలియన్ డాలర్లు అయితే.. 2024-25లో 27.8 బిలియన్ డాలర్లుగా ఉండటం చూస్తే.. ఈ రంగం ఎంత దూసుకెళుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ దూకుడు ఎక్కువగా ఉండే వీలుందని చెబుతున్నారు.