బ్రేకింగ్: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 6గురు దుర్మరణం
ఫిలడెల్పియా రాష్ట్రంలో ఒక చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.
By: Tupaki Desk | 1 Feb 2025 5:41 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న విమానం - సైనిక హెలికాఫ్టర్ ఢీ కొన్న ఘటనలో పలువురు మరణించిన విషాదం నుంచి బయటకు రాక ముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్పియా రాష్ట్రంలో ఒక చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. అది కూడా జనావాసాల మధ్య కూలిపోయింది. ఈ సందర్భంగా పెద్ద పేలుడు చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో కూలిపోవటం.. ఆ వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ఉన్న వారికి అసలేం జరిగిందో అర్ఱం కాని పరిస్థితి. కొద్ది క్షణాలకు విమానం కూలిన విషయాన్ని గుర్తించి షాక్ తిన్నారు.
విమానం కూలిన వేళ.. చోటు చేసుకున్న పేలుడు.. భారీగా ఎగిసిపడిన మంటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిలడెల్పియాలోని షాపింగ్ మాల్ కు సమీపంలో విమానం టేకాఫ్ అయ్యింది. కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు.. కార్లు దగ్థమయ్యాయి. విమానం కూలినంతనే భారీ పేలుడు చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్నంతనే అధికారులు స్పందించి.. సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లుగా తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పైలెట్లు.. నలుగురు ప్రయాణికులుగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానాన్ని లీఆర్ జెట్ 55గా గుర్తించారు. ఈ విమాన ప్రమాదంపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ శాప్రియా స్పందిస్తూ.. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లను మూసేసి.. సహాయక చర్యలు చేపట్టారు. సాంకేతిక లోపంతోనే ఈ విమాన ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫెలెడెల్పియా విమానాశ్రయం నుంచి బిజినెస్ సంబంధిత జెట్స్.. చిన్న విమనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానంలో ప్రయాణిస్తున్న వారి వివరాలు బయటకు రావాల్సి ఉంది. శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవటం.. ప్రయాణికుల విమానం.. సైనిక హెలికాఫ్టర్ ఢీ కొని నదిలో పడిపోవటం తెలిసిందే.ఈ ఘటనలో 64 మంది విమాన ప్రయాణికులు మరణించారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవటం గమనార్హం.