Begin typing your search above and press return to search.

అమెరికా యూత్ దొంగతనాలు ఇలా కూడా చేస్తారా?

కాగా దోపిడీలకు పాల్పడుతున్న యువకులు ముందుగానే తమను ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తున్నారు

By:  Tupaki Desk   |   27 Sep 2023 8:32 AM GMT
అమెరికా యూత్ దొంగతనాలు ఇలా కూడా చేస్తారా?
X

అమెరికాలోని ఫిలడెల్పియా నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. మూకుమ్మడిగా ఐఫోన్‌ మొబైల్‌ ఫోన్‌ స్టోర్లపై దాడి చేసి అందినకాడికి విలువైన ఫోన్లను, ట్యాబులు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను దోచుకుపోతున్నారు. మొబైల్‌ ఫోన్ల స్టోర్లు, ఎలక్ట్రానిక్‌ స్టోర్లే లక్ష్యంగా పేట్రేగిపోతున్నారు. వందల మంది ముసుగులు ధరించి మూకుమ్మడిగా లూఠీ చేస్తున్నారు. దీంతో ఫిలడెల్పియా నగరంలోని వ్యాపారస్తులు ఈ మూకుమ్మడి దోపిడీలతో బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితం యాపిల్‌ స్టోర్‌ లోకి చొరబడి భారీ దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

తాజాగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఫిలడెల్పియాలోని యాపిల్‌ స్టోర్‌ లోకి కొంతమంది యువకుల బృందం చొరబడింది. భారీ ఎత్తున ఐఫోన్లు, ఐప్యాడ్లు తీసుకుని పారిపోయారు. వరుస దొంగతనాలతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ దొంగల్లో కొందరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఐఫోన్లు, ఐప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల్లో టీనేజ్‌ యువకులే ఎక్కువ మంది ఉన్నారని పోలీసులు ప్రకటించారు.

కాగా దోపిడీలకు పాల్పడుతున్న యువకులు ముందుగానే తమను ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే దొంగతనం చేసేటప్పుడు వీడియోలు తీసుకుంటున్నారని వెల్లడైంది. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో వీరే వైరల్‌ చేస్తున్నారని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వెలుగుచూశాయి. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

ది ఫిలడెల్ఫియా ఇంక్వైరర్‌ వార్తాపత్రిక కథనం ప్రకారం.. దొంగతనానికి పాల్పడ్డ తర్వాత మొత్తం వంద మందిలో దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఘటన చోటు చేసుకోగా పరిస్థితి అదుపులోకి రావడానికి అర్ధరాత్రి వరకు పట్టిందని అంటున్నారు.

ఈ వరుస దొంగతనాల నేపథ్యంలో ఉద్యోగులు, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నాలుగు రాష్ట్రాల్లో 9 యాపిల్‌ స్టోర్లలను నిర్వాహకులు మూసివేశారు. ఈ వ్యవస్థీకృత నేరాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఎడ్డీ ఇరిజారీ అనే డ్రైవర్‌ను కాల్చి చంపిన ఫిలడెల్ఫియా పోలీసు అధికారిపై హత్య ఆరోపణలను కొట్టివేయాలని న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడమే యువకుల్లో ఆగ్రహానికి కారణమని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ నిరసనను వారు ఇలా దోపిడీల ద్వారా తెలియజేశారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం న్యాయమూర్తి తీర్పుకు, ఈ దొంగతనాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.