ఆ గ్రామంలో 5 దోమల్ని చంపి తెస్తే రూపాయిన్నర.. ఎందుకలా?
ఐదు దోమల్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ తీసుకొస్తే మన రూపాయిల్లో రూపాయిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది.
By: Tupaki Desk | 20 Feb 2025 4:56 AM GMTఆ ఊళ్లో దోమలు విపరీతంగా పెరిగి డెంగీ కేసులు అంతకంతకూ ఎక్కువ అయ్యాయి. డెంగీ బారిన పడిన వారు అంతకంతకూ పెరిగిపోతున్నారు. దీనికి తోడు ఈ మధ్యనే ఇద్దరు విద్యార్థులు మరణించారు కూడా. దీంతో.. ఆ ఊరు పెద్దలు ఒక ఐడియా వేశారు. తమ ఊళ్లో వారంతా దోమల్ని చంపే ప్రోగ్రాంలో బిజీ అయ్యేలా ఒక వినూత్న కార్యక్రమానికి తెర తీశారు.
ఐదు దోమల్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ తీసుకొస్తే మన రూపాయిల్లో రూపాయిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది? జనాలు దోమల మీద దండయాత్రకు దిగారు. ఇంతకూ ఇదెక్కడ అంటారా? పిలిఫీన్స్ దేశంలో చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని మనీలాకు సమీపంలోని ఒక ఊరు వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దోమల్ని సంహరించే కార్యక్రమంలో మరో అంశాన్ని చేర్చారు.
దోమలు మాత్రమే కాదు.. దోమల లార్వాల్ని తీసుకొచ్చినా కూడా నజరానా ఉంటుందని ప్రకటించింది. దీంతో.. ఇప్పుడు ఆ దేశంలోని వారు దోమల మీద యుద్ధం ప్రకటించి.. దొరికిన దోమను దొరికినట్లుగా చంపేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇంతటి నిర్ణయానికి కారణం ఈ ఏడాదిలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావటమే. లక్ష వరకు జనాభా ఉన్న ఈ ఊళ్లో (అడిషన్ హిల్స్ ) డెంగీ కారణంగా ఇద్దరు విద్యార్థులు మరణించటంతో దోమల అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఊరి పెద్ద కార్లిటో దోమల్ని చంపేసి తీసుకొస్తే బహుమతి ఇస్తామని చెప్పటంతో.. అందరూ దోమల్ని చంపే పనిలో పడి.. డబ్బాలతో తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆసక్తికరంగా మారాయి.