నా ప్రాణాలకు హాని జరిగితే దేశాధ్యక్షుడ్ని లేపేస్తా.. సంచలన వార్నింగ్
కారణం.. ఆ దేశంలో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య నడుస్తున్న శత్రుత్వం మరో స్థాయికి వెళ్లిపోయింది.
By: Tupaki Desk | 24 Nov 2024 5:03 AM GMTరాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. ఒకరిపై ఒకరు నిందలు.. తీవ్రమైన ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే వ్యవహారం మాత్రం దీనికి భిన్నమైనది. రాజకీయ ద్వేషం.. శత్రుత్వాలు చాలానే చూసి ఉండొచ్చు కానీ ఫిలిప్పీన్స్ లో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారం మాత్రం పెను సంచలనంగా మారింది. కారణం.. ఆ దేశంలో రెండు బలమైన రాజకీయ కుటుంబాల మధ్య నడుస్తున్న శత్రుత్వం మరో స్థాయికి వెళ్లిపోయింది.
దేశాధ్యక్షుడికి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు ఆ దేశ మహిళా నేత. అయితే.. ఆమె దేశ ఉపాధ్యక్షురాలు కావటం పెను సంచలనమైంది. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిన పక్షంలో దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్ ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే చేసిన బహిరంగ ప్రకటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. తన క్షేమం గురించి ఎవరికి ఎలాంటి భయాలు అక్కర్లేదన్న ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ మధ్యన నేనో కాంట్రాక్టు కిల్లర్ తో మాట్లాడా. నా ప్రాణాలకు హాని ఉండి.. నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్.. ఆయన భార్య లిజా అరనేటా.. పార్లమెంట్ లో ప్రతినిధుల సభ స్పీకర్ ను చంపేయమని చెప్పా. ప్రాణాలు పోయాయని కన్ఫర్మ్ చేసుకనే వరకు దాడి చేస్తూనే ఉండాలని చెప్పా. అందుకు అతను సరే చెప్పాడు. నేనేమీ ఇది సరదాకు చెప్పట్లేదు. జోక్ చేయట్లేదు’’ అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడా దేశంలో సంచలనంగా మారాయి.
దేశాధ్యక్షుడ్ని అంతం చేయాలని కాంట్రాక్టు కిల్లర్ తో మాట్లాడిన విసయాన్ని స్వయంగా దేశ ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయటంతో అధ్యక్ష కార్యాలయం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేశామని.. రక్షణ బాధ్యతల్ని అధ్యక్షుడి రక్షణ దళానికి అందజేస్తున్నట్లు ప్రకటించటమే కాదు.. సారా వ్యాఖ్యలపై తగిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్ బెర్సామిన్.
ఈ వివాదానికి కొన్నేళ్లు ముందుకు వెళితే.. 2022 మేలో ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్.. ఉపాధ్యక్ష పదవికి సారా పోటీ చేయటం.. ఘన విజయాన్ని సాధించటం జరిగింది. నిజానికి సారా తండ్రి రోడ్రిగో కు.. దేశాధ్యక్షుడు మార్కోస్ తండ్రి సీనియర్ మార్కోస్ లు ఇద్దరు బద్ధ శత్రువులు. తాజా ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా రాజీనామా చేసిన సారా.. దేశ ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య అస్సలు పొసగని పరిస్థితి.
రాజకీయంగానే కాదు.. వివిధ అంశాల విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. సంచలన వ్యాఖ్యలు చేసే సారా.. కొంత కాలం క్రితం.. దేశాధ్యక్షుడి తలను నరుకుతున్నట్లుగా తనకు ఆలోచనలు వస్తున్నట్లుగా వ్యాఖ్యానించటం అందరూ షాక్ తినేలా చేశారు. అధ్యక్షుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని.. పాలించే సత్తా లేదని.. తమ కుటుంబానని రాజకీయంగా బలహీన పర్చాలన్న కుట్ర పన్నుతున్నట్లుగా ఆమె ఆరోపించారు.
ఇక.. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో విషయానికి వస్తే.. ఆయన ఫిలిప్పీన్స్ లో కరుడుగట్టిన రాజకీయ నేతగా పేరుంది. దేశంలో మాదక ద్రవ్యాల ముఠా మీద ఉక్కుపాదం మోపటమే కాదు.. దావో నగర మేయర్ గా.. ఆ తర్వాతి కాలంలో దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. తన పదవీ కాలంలో డెత్ స్క్వాడ్ పేరుతో వేలాది మంది డ్రగ్స్ ముఠా సభ్యుల్ని లేపేయటం తెలిసిందే. అయితే.. దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసును ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా దేశ ఉపాధ్యక్షురాలు సారా చేసిన సంచలన ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ రోమియో ఒక కీలక ప్రకటన చేశారు. లక్షన్నరకు పైనే ఉన్న దేశ సైనికులు ఎప్పుడు పక్షపాతరహితంగానే పని చేస్తారని.. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగ బద్ధ సంస్థల ఆదేశాల్ని శిరసావహిస్తారని పేర్కొనటం గమనార్హం. మొత్తంగా దేశాధ్యక్షుడ్ని లేపేస్తానంటూ ఓపెన్ గా ప్రకటించిన ఉపాధ్యక్షురాలు సారానే అవుతారని చెప్పాలి.