ఫోన్ ట్యాపింగ్ కేసులోకీలక పరిణామం.. వారిద్దరు తిరిగి రాక తప్పదా?
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 19 March 2025 10:08 AM ISTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో విచారణ ముందుకు వెళ్లకుండా ఉన్న పరిస్థితి. ట్యాపింగ్ ఇష్యూలో కర్త.. కర్మ.. క్రియ అన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు.. మరో కీలక నిందితుడు శ్రవణ్ రావులను దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు అవసరమైన కీలక పరిణామం తాజాగా చోటుచేసుకుంది
ఈ ఇద్దరు నిందితులపైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. తాజా సమాచారాన్ని తెలంగాణ సీఐడీకి సమాచారం అందించింది. ఈ పరిణామంతో ఈ ఇద్దరు దేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగుమం అయినట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి పాస్ పోర్టుల్ని పోలీసులు రద్దు చేయించిన వైనం తెలిసిందే.
గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే వీరు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే..ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నేతలు ఎవరన్న విషయం బయటకు రావాల్సి ఉంది. అందుకు ఈ ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది.
దీనికి తోడు వీరిని ఎప్పటిలోపు అరెస్టు చేస్తారంటూ కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో.. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్నిచర్యల్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు.