Begin typing your search above and press return to search.

తవ్వే కొద్దీ షాకింగ్ అంశాలు బయటకు.. మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లు!

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పట్టుబడిన వారిలో ఒక కీలక నిందితుడి ఫోన్ ను విశ్లేషించగా ఈ షాకింగ్ నిజం వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 4:24 AM GMT
తవ్వే కొద్దీ షాకింగ్ అంశాలు బయటకు.. మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లు!
X

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వాడిన ఫోన్ ను రహస్యంగా విన్నట్లుగా వివరాలు వెల్లడైన షాక్ నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు మరో సంచలన అంశం వెలుగు చూసింది. మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల పైనా నిఘా ఉన్నట్లుగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా జడ్జి ఉన్నట్లుగా తేలింది. ఈ ఇద్దరు హైకోర్టు జడ్జిలకు సంబంధించిన సమగ్ర ప్రొఫైళ్లు తయారు చేసినట్లుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు గుర్తించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పట్టుబడిన వారిలో ఒక కీలక నిందితుడి ఫోన్ ను విశ్లేషించగా ఈ షాకింగ్ నిజం వెలుగు చూసింది. నిందితుడి సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ యంత్రాంగం ఇటీవల హైదరాబాద్ పోలీసులకు రిపోర్టును పంపింది. నివేదికలో పలు ప్రొఫైళ్లు ఉండగా.. వాటిలో ఇద్దరు జడ్జిల ఫోటోలతో కూడిన ప్రొఫైళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో జడ్జిలకు సంబంధించిన సమగ్ర సమచారాన్ని అందులో నమోదు చేసినట్లుగా గుర్తించారు. చివరకు వారి కుటుంబ సభ్యుల వివరాలు అందులో ఉన్నట్లుగా తేల్చారు.

అలా సిద్దం చేసిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది. ఆయా నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ ను సేకరించినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయా ఫోన్లకు సంబంధించిన వాయిస్ కాల్స్.. మెసేజ్ లతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్.. ఈ మొయిల్.. చాట్.. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్.. తదితర వివరాల్ని తెలుసుకోవటంపై ఈ ముఠా ఫోకస్ చేసినట్లుగా గుర్తించారు.

ఈ ఇద్దరు హైకోర్టు జడ్జిల మీద స్పెషల్ గా ఎందుకు ఫోకస్ చేసి.. ట్యాప్ చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగు చూసిన కొత్తల్లో ఒక హైకోర్టు జడ్జితో పాటు.. ఆయన సతీమణి ప్రొఫైల్ రూపొందించి.. వారి ఫోన్ మీదా నిఘా ఉంచినట్లుగా వెల్లడి కావటం అప్పట్లో పెను కలకలాన్ని రేపింది. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అయిన వైనం వెలుగు చూసింది. రానున్న రోజుల్లో ఈ తరహాలో మరెన్ని అంశాలు వెలుగు చూస్తాయన్నది ఇప్పుడు చర్చగా మారింది.