స్మార్ట్ ఫోన్.. ఏడాదిలో అన్ని రోజులు దీనిపైనే!
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరిలో విలువైన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి
By: Tupaki Desk | 18 July 2024 5:30 PM GMTప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరిలో విలువైన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అనేక ఇంటర్నెట్ ప్యాకేజీలను టెలికాం ఆపరేటర్లు అందిస్తుండటం వినియోగదారులకు వరంగా మారింది.
ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల నుంచి వార్తల వరకు, పాటల నుంచి సినిమాలు, ఓటీటీల వరకు, ఏదైనా సమాచారం నుంచి ఆన్ లైన్ క్లాసుల వరకు ఇలా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో దానిపైన గడిపే సమయం పెరుగుతోంది. ఇది అంతకంతకూ పెరిగిపోతోంది.
భారత్ లో రోజుకు సగటున 4.30 గంటలపాటు స్మార్ట్ ఫోన్లతో గడుపుతున్నట్టు వెల్లడైంది. ఈ సమయం ప్రపంచంలో అయితే 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో 70 రోజులు స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్ యూజర్లు రోజులో 58 సార్లు తమ ఫోన్లను తనిఖీ చేసుకుంటుండటం గమనార్హం. ప్రపంచంలో అత్యధికంగా పిలిఫ్ఫీన్స్ దేశస్తులు అత్యధిక సమయం ఫోన్లతో గడుపుతున్నారు. అందరికంటే తక్కువగా స్మార్ట్ ఫోన్ చూసేవారిలో జపనీయులు ఉన్నారు.
వయసులపరంగా చూస్తే 12–27 ఏళ్లలోపు వారే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లలో మునిగి తేలుతున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమయం ఫోన్ లో గడుపుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మíß ళలు రోజుకు 2.47 గంటల సమయం ఫోన్లతో గడుపుతున్నారు. ఇక పురుషుల స్క్రీన్ టైమ్ 2.34 గంటలుగా ఉంటోంది. ఎక్కువ మంది తమ ఆసక్తులకు అనుగుణంగా వీడియోలు చూడటానికే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఘనా, దక్షిణాఫ్రికా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు మించిపోతుండటం గమనార్హం. దక్షిణ అమెరికాకు చెందిన నాలుగు దేశాలు, నాలుగు సౌత్ ఈస్ట్ దేశాలు అత్యధిక సమయం గడుపుతున్న దేశాల జాబితాలో ఉన్నాయి.
ఇక అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు చాలా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నారు. దీంతో వారంతట వారే స్వయంగా లక్ష్యాలను విధించుకుంటున్నారట. ఫోన్ ను వినియోగించడం తగ్గించాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అమెరికన్లలో 40 శాతం మంది లక్ష్యం నిర్దేశించుకున్నారని తెలుస్తోంది.
మరోవైపు స్మార్ట్ ఫోన్లను అతిగా వినియోగిస్తే తలనొప్పి, నరాల బలహీనత, కంటిచూపు మందగించడం, చిత్తభ్రాంతి, నిద్రలేమి, చిరాకు, అసహనం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు చూసే సమయాన్ని తగ్గించాలంటున్నారు. ముఖ్యంగా చిన్నారులకు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ ఇస్తే దుష్పరిణామాలు తప్పవంటున్నారు.