Begin typing your search above and press return to search.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అధికారుల వాంగ్మూలాల్లో సంచలన విషయాలు!

అవును... తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఇద్దరు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో కీలక విషయాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   28 May 2024 5:15 PM GMT
ఫోన్‌  ట్యాపింగ్‌  కేసు.. అధికారుల వాంగ్మూలాల్లో సంచలన విషయాలు!
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా బీఆరెస్స్ కు సమస్యలుగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగ రావు తమ తమ వాగ్మూలంలలో పేర్కొన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలు తెరపైకి వచ్చాయని సమాచారం.

అవును... తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఇద్దరు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో కీలక విషయాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. తొలుత మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో... అప్పటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజు, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టినట్లు చెప్పారని అంటున్నారు.

ఇదే క్రమంలో... తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచినట్లు చెప్పిన రాధాకిషన్ రావు... ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టినట్లు వెల్లడించారని అంటున్నారు. ఇదే క్రమంలో... అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ తోపాటు తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్‌ చేసినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ అనుచరుల ఫోన్లపైనా నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారని అంటున్నారు. ఇదే క్రమంలో... కొందరు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేయడంతోపాటు.. వాట్సప్‌, స్నాప్‌ చాట్‌ లో మాట్లాడిన వారి వివరాలు సైతం సేకరించినట్లు రాధాకిషన్‌ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని సమాచారం!

ఇదే క్రమంలో... ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోనూ మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... విపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లతోపాటు వాహనాలను ట్రాక్‌ చేసినట్లు తెలిపారని అంటున్నారు.

అదేవిధంగా... జీ.హెచ్‌.ఎం.సీ ఎన్నికల సమయంలోనూ.. మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్‌ చేసినట్లు వెల్లడించిన భుజంగరావు... మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుదారుల ఫోన్లును ట్యాప్‌ చేసినట్లు తన గాంగ్మూలంలో వెల్లడించారని తెలుస్తుంది. మాదాపూర్‌ ఎస్‌.ఓ.టీ పోలీసుల మద్దతుతోనే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారని.. మరోసారి బీఅరెస్స్ ను అధికారంలోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారని సమాచారం!