ఏపీలో ఎన్నికల వేళ.. ఫోన్ ట్యాపింగ్ కలకలం!
ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 20 March 2024 3:13 PM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఫోన్ ట్యాపింగ్ పై సంచలన విమర్శలు చేశారు.
వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతోందని టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా? అని నిలదీశారు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు పాటించే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు.
జగన్ ప్రభుత్వం నిరంతరం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని బొండా ఉమ ఆరోపించారు. తమతో పాటు అధికారుల ఫోన్లపైనా నిఘా ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఇచ్చిన స్టేట్‌మెంట్లే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారులు.. నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు.
డబ్బు, మద్యం అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. పోలీస్ అధికారి కొల్లి రఘురామ రెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమరనాథ్ రెడ్డి , పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ధ్రువీకరించారని బొండా ఉమ వెల్లడించారు. ఐపీఎస్ రూల్స్ కి బదులు ౖవైసీపీ రూల్స్ ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.