Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి....!

ఈ కేసుని విచారిస్తున్న అధికారుల ముందు నిందితులు చాలా విషయాలు వెల్లడి చేశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 3:58 AM GMT
ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు వెలుగులోకి....!
X

తెలంగాణా రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్ అన్నది రచ్చ రేపుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పనిగట్టుకుని కొందరు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయమని పురమాయించింది అన్న దాని మీద జరుగుతున్నా విచారణ కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడి చేయడంతో ఎవరి మెడకు ఈ కేసు చుట్టుకుంటుందో ఏ పెద్ద తలకాయలు దీని వెనకాల ఉన్నారో అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.

ఈ కేసుని విచారిస్తున్న అధికారుల ముందు నిందితులు చాలా విషయాలు వెల్లడి చేశారు అని అంటున్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇలా చేశామని వారు అంగీకరించారు. ఇక తాము ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిలో కొందరు కీలక నేతలు వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు కూడా ఉన్నారని పూసగుచ్చినట్లు చెప్పేశారు.

ఇంతటితో ఆగలేదు, బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఈ మొత్తం ఫోన్య్లను ట్యాపింగ్ చేయమన్నారని కొన్ని నంబర్లు ఇచ్చారని కూడా వారు చెప్పారు. దాని ప్రకారమే తాము అలాగే చేశామని వారు చెప్పడం విశేషం. ఇక మెయిన్ ట్యాపింగ్ డివైజ్ ని ధ్వంసం చేశామని కూడా చెప్పారు. అంతే కాదు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను విరిచి మూసీ నదిలో పారేశామని కూడా వారు చెప్పడం జరిగింది.

ఇక కొన్ని కీలక పత్రాలను కాల్చేశామని కూడా వారు చెప్పడంతో ఈ కేసులో చాలా అంశాలు జరిగాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు.

అదే విధంగా ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డిసిపి తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అంతే కాదు 2019 ఎన్నికలు ఆ మీదట జరిగిన మునుగోడు,హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల టైం లోనే ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లుగా విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు.

ఇక అన్నిటికన్నా ఎక్కువగా గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు ఇక ఈ ఫ్యోన్ ట్యాపింగ్ లో ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబీకుల ఫోన్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా తేలింది అని అంటున్నారు. అంతే కాదు ప్రస్తుతం సీఎం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇంటికి కిలో మీటర్ పరిధిలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఎన్నో సంచలన విషయాలు ఈ విచారణలో వెల్లడి అయినట్లుగా చెబుతున్నారు