డొంక కదలనుందా? ప్రణీత్ రావుపై కేసు నమోదు!
రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణీత్ రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 11 March 2024 5:16 AM GMTకొద్ది రోజులుగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ప్రణీత్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్ పేరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకూ ఆయన ఎవరంటే.. ఒక పోలీసు అధికారి. సిరిసిల్ల జిల్లాలో ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన ఆయన ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఇంతకూ ఏ కారణం మీదన అంటే.. ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని.. నిఘా వర్గాల డేటాను ధ్వంసం చేశారన్న తీవ్ర ఆరోపణ ఆయన మీద ఉంది. ఈ మధ్యనే ఆయన తీరుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.
తాజాగా ఈ అంశంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపైనా.. మరికొందరిపైనా చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి. రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రణీత్ రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ఐపీసీతోపాటు ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం.. సమాచార సాంకేతిక చట్టంలోని వివిధ సెక్షన్లను చేర్చటం హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం గత ప్రభుత్వంలోని కీలక నేతలకు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.మొత్తంగా తాజా పరిణామాలు గులాబీ తోటలో కొత్త అలజడిని క్రియేట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రణీత్ రావు కెరీర్ ను చూస్తే.. 2018 నుంచి ఎస్ఐబీలో సీఐగా ఉంటూ 2023లో ప్రమోషన్ పొందారు. ఆయన విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేకంగా రెండు రూంలతో పాటు.. 17 కంప్యూటర్లు.. ప్రత్యేక ఇంటర్ నెట్ సదుపాయాల్ని కల్పించినట్లుగా గుర్తించారు. ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏమంటే.. అనధికారికంగా గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన వివరాల్ని రహస్యంగా సేకరించినట్లుగా.. వాటిని పర్యవేక్షించినట్లుగా చెబుతున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ఆయన మీద ఉన్న అభియోగం.
గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై.. నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత పెన్ డ్రైవ్ లు.. ఎక్సటర్నల్ హార్డ్ డిస్కుల్లోకి కాపీ చేసుకుంటూ ఉండేవారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గత ఏడాది డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినంతనే నాలుగో తేదీన ప్రణీత్ రావు తన ఆఫీసులో నిల్వ ఉంచి సమాచారాన్ని.. పలు హార్డు డిస్కులను .. ఇతరాలను ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు.
ఆ సమయంలో తన ఆఫీసులోని సీసీ కెమేరాల్ని పని చేయకుండా ఆపేశారని చెబుతున్నారు. దీని కారణంగా కీలకమైన నిఘా సమాచారం మాయమైనట్లుగా చెబుతున్నారు. ధ్వంసం చేసిన పాత వాటిని తీసేసి.. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవని.. రానున్న రోజుల్లో రాజకీయ సంచలనానికి తాజా కేసు ఒక కారణమవుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.