Begin typing your search above and press return to search.

డేటింగ్ లో కొత్త ట్రెండ్... "ఫబ్బింగ్" అంటే ఏమిటి?

ఈ క్రమంలో ప్రస్తుతం డేటింగ్ ప్రపంచంలో "ఫబ్బింగ్" అని పిలవబడే ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   19 March 2025 9:25 AM IST
డేటింగ్ లో కొత్త ట్రెండ్... ఫబ్బింగ్  అంటే ఏమిటి?
X

నెట్టింట నిత్యం సరికొత్త పదాలు, కొత్త కొత్త విషయాలు ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం డేటింగ్ ప్రపంచంలో "ఫబ్బింగ్" అని పిలవబడే ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇది బంధాలను విచ్ఛిన్నం చేయడంలో సహకరిస్తోందని అంటున్నారు.

అవును... డేటింగ్, సంబంధాల ప్రపంచంలో ఇప్పుడు "ఫబ్బింగ్" అనే ఒక కొత్త ట్రెండ్ వేగంగా వైరల్ అవుతోంది. ఫోన్, స్నబ్బింగ్ అనే రెండు పదాలను కలిపి ఈ పదం రూపొందించబడగా.. ఇందులో ఫోన్ ‘కీ’ రోల్ పోషిస్తోంది. అంటే.. భాగస్వామిని విస్మరించి ఫోన్ తో బిజీగా ఉండటం అన్నమాట. ఈ రోజుల్లో ఇది అతిపెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.

ఫబ్బింగ్ అంటే... ఒక వ్యక్తి తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఫోన్ లో బిజీగా ఉండటమని అర్ధం. అది డేట్ నైట్ అయినా, రొమాంటిక్ డిన్నర్ సమయమైనా.. లేక, నాణ్యమైన ఏకాంత సమయాన్ని గడపడానికి దొరికిన అవకాశం అయినా.. భాగస్వామిని ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం ఫోన్ లో స్క్రోల్ చేయడం, సోషల్ మీడియాలో మునిగి తేలడం!

దీనివల్ల బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని అంటున్నారు. భావోద్వేగ సంబంధాన్ని ఈ అలవాటు బలహీనపరుస్తుందని చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ఫబ్బింగ్ చేయడం వల్ల.. వారికి తాము ముఖ్యం కాదని భాగస్వామి భావిస్తున్నారని అంటున్నారు. ఒక సంబంధంలో ఒకరు పదే పదే ఫోన్ కే ప్రాధాన్యమిస్తే... భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్లే.

దానివల్ల భాగస్వామి.. తాను ఒంటరి అని, తాను అవతలి వ్యక్తికి సెకండ్ ప్రియారిటీ అని భావించే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఫబ్బింగ్ తరచూ భాగస్వామిలో అనుమానం, అపనమ్మక భావనలకు దారి తీస్తుందని అంటున్నారు. దీనివల్ల తన భాగస్వామి మరొకరితో టచ్ లో ఉన్నారనే అభిప్రాయం కలుగుతుందని చెబుతున్నారు.

గ్రాజియా మ్యాగజైన్ నివేదిక ప్రకారం... ఫబ్బింగ్ చేసే జంటలు ఎక్కువగా గొడవలు పడుతుంటారని.. నిత్యం భావోద్వేగ అసంతృప్తితో కొట్టుమిట్టాడతారని.. భాగస్వామిపై పూర్తి అపనమ్మకాన్ని, అనుమానన్ని కలిగి ఉంటారని.. ఫలితంగా ఫబ్బింగ్ వల్ల ఎన్నో జంటలు విడిపోతున్నాయని చెబుతున్నారు.

ఫబ్బింగ్ ను ఎలా నివారించాలి?:

తోటి మనిషి కంటే వస్తువులకు ఎక్కువ విలువ ఇవ్వడం ఎప్పుడో మొదలైందని చెబుతారు. అయితే... చివరికి భాగస్వామి విషయంలోనూ ఇదే జరిగే పరిస్థితి వచ్చేసిందని చెబుతున్నారు. అలాంటప్పుడు భాగస్వామితో గడుపుతున్న సమయంలో ఫోన్ ను దూరంగా ఉంచడం లేదా సైలంట్ మోడ్ లో పెట్టడం వంటివి చేయడం అత్యుత్తమమని చెబుతున్నారు.

ఇదే సమయంలో భాగస్వామి ఫబ్బింగ్ వల్ల.. తాను ఎంత అసౌకర్యానికి గురవుతుంది ఓపెన్ గా చెప్పాలని.. అర్ధం చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. సమస్యను, అసౌకర్యాన్ని భాగస్వామికి చెప్పకపోవడం కూడా తప్పే అనేది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత ఆ అభిప్రాయానికి ఎంతమేర విలువ ఉంటుందనేది.. ఫ్యూచర్ నిర్ణయాలకు కారణమవుతోంది.

అదేవిధంగా... ఏమాత్రం అవకాశం ఉన్నా.. ఫోన్ లేని వీకెండ్స్.. లేదా, డేట్ నైట్స్ ప్లాన్ చేసుకోవాలని.. దీని ద్వారా ఒకరితో ఒకరు న్యాణ్యమైన సమయమే కాకుండా.. డిస్ట్రబెన్స్ లేని స్వచ్ఛమైన సమయాన్ని గడపొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి రోజు వారంలో ఒకటి ఉన్నా... హ్యాపీ అని అంటున్నారు.