Begin typing your search above and press return to search.

దివ్యాంగులకు అవమానించేలా డ్యాన్స్.. భారత మేటి క్రికెటర్లపై కేసు

ప్రపంచం అంతా అలా ఉండగా.. ముగ్గురు భారత మాజీ క్రికెటర్లు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది

By:  Tupaki Desk   |   16 July 2024 7:56 AM GMT
దివ్యాంగులకు అవమానించేలా డ్యాన్స్.. భారత మేటి క్రికెటర్లపై కేసు
X

సమాజంలో మనుషులంతా సమానమే.. గతంలో ఏమో కానీ.. ప్రపంచం అంతా టెక్నాలజీమయం అయిపోయిన ఈ కాలంలో ఎవరు ఎక్కడివారైనా సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు సైతం ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఈ కోణంలోనే 2015లో కేంద్ర ప్రభుత్వం వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలంటూ ఏకంగా మార్గదర్శకాలే విడుదల చేసింది. మీడియాలోనూ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఈ విధంగానే సంబోధిస్తున్నారు. కాగా.. దివ్యాంగుల సంఘాలు బలంగా మారి.. ఆత్మ గౌరవం కోసం నినదిస్తున్నాయి.

క్రికెటర్లూ ఇది తగునా..?

ప్రపంచం అంతా అలా ఉండగా.. ముగ్గురు భారత మాజీ క్రికెటర్లు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీనికి నేపథ్యం ఏదైనా కానీ.. వారి తీరు మాత్రం నెట్టింట ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ వివాదంలో చిక్కిన క్రికెటర్లు ఎవరంటే యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్. దివ్యాంగుల మనోభావాలను కించపరిచేలా వారిని అనుకరిస్తూ వీరు చేసిన వీడియో సోషల్‌ మీడియాకెక్కింది. దీనిపై ఫిర్యాదు రావడంతో ముగ్గురిపైనా కేసు నమోదైంది. మరో క్రికెర్ గురుకీరత్ మాన్ పైనా ఇదే విషయంలో కేసు నమోదైంది. ఇతడు పెద్దగా ఎవరికీ తెలియని క్రికెటర్.

అనవసర వివాదం

ఇటీవల వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ లీగ్ జరిగింది. దీంట్లో ఆయా దేశాల రిటైరైన క్రికెటర్లు పాల్గొన్నారు. భారత జట్టుకు యువరాజ్ సారథ్యం వహించాడు. ఈ టోర్నీ ఇంగ్లండ్‌ లో జరిగింది. ఆదివారం రాత్రి ముగిసింది. ఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి చాంపియన్ గా నిలిచింది. కాగా, భారత లెజెండ్స్ జట్టులో హర్భజన్‌ సింగ్, సురేశ్ రైనాతో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు, ఓపెనర్ రాబిన్ ఊతప్ప తదితరులున్నారు. ఫైనల్లో రాయుడు 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక పైనల్లో భారత విజయాన్ని సెలెబ్రేట్‌ చేసుకునే క్రమంలో యువరాజ్‌, భజ్జీ, రైనా అత్యుత్సాహం ప్రదర్శించారు. బాలీవుడ్ సినిమాలోని పాటకు దివ్యాంగుల తరహాలో అభినయం చేస్తూ వీడియో చేశారు. దీంతోనే కొందరు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు క్రికెటర్లపై కేసు నమోదైంది. మరోవైపు భజ్జీ జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చాడు.