Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు పై ఫుల్ క్లారిటీతో వైసీపీ ఎంపీ

మొత్తానికి దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ పిల్లి సుభాష్ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీని వీడను అని ఆయన స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 4:14 AM GMT
పార్టీ మార్పు పై ఫుల్ క్లారిటీతో వైసీపీ ఎంపీ
X

అదేంటో వైసీపీలో ఇపుడు ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు బయటకు వెళ్తారో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది. వైసీపీ సరిగ్గా తొమ్మిది నెలల క్రితం కంచుకోటగా ఉండేది. ఎంతో పటిష్టంగా కనిపించేది. ఓటమి అన్న మాటను కూడా ఎవరూ సీరియస్ గా పట్టించుకునేవారు కాదు.

అది అతి విశ్వాసంగా మారి చివరికి వై నాట్ 175గా చేరి వైసీపీ పుట్టెను ముంచేసింది. 11 సీట్లకు పరిమితం చేసింది. వైసీపీకి దక్కిన ఆ ఘోర పరాజయం తరువాత ఈ రోజుకీ జీర్ణించుకోలేని స్థితిలోకి అధినాయకత్వం ఉంది అంటే ఇక లీడర్లూ క్యాడర్ గురించి చెప్పతరమా అన్నదే అందరి మాట.

ఇక పార్టీ ఓటమి తరువాత జగన్ పెద్దగా జనంలోకి రావడం లేదు. పార్టీ యాక్టివిటీ కూడా తగ్గించేశారు. ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో నేతలు కూడా ఒక్కొక్కరుగా తమ దారి చూసుకుంటున్నారు. ఎవరికి వారుగా కీలక నిర్ణయాలు తీసుకుని వైసీపీని వీడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఓడినా తమకు ఉన్న అతి పెద్ద సంఖ్యా బలం ప్రభావంతో రాజకీయంగా నిలబడవచ్చు అని ఆశించిన రాజ్యసభ, శాసనమండలిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అక్కడ వైసీపీకి ఉన్న మెజారిటీలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఎమ్మెల్సీలు ఇప్పటికి ఒక అయిదారుగురు రాజీనామాలు చేశారు.

రాజ్యసభ సభ్యుల లిస్ట్ విజయసాయిరెడ్డితో కలిపి నలుగురు అయ్యారు. ఇదే పరంపర కొనసాగుతుంది అని అంటున్నారు. దాంతో మిగిలిన ఏడుగురిలో ఎందరు మిగులుతారు అన్నది కూడా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు చెందిన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద కూడా పార్టీ మార్పు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన పార్టీని వీడుతారని జనసేనలో చేరుతారని కూడా అంటున్నారు.

మొత్తానికి దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ పిల్లి సుభాష్ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీని వీడను అని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీని ఎందుకు వీడాలని కూడా ఆయన ప్రశ్నించారు. తన మీద కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయని ఆయన అన్నారు. కానీ తాను పార్టీ పక్షానే ఉంటాను అని అంటున్నారు.

పొరపాటున కూడా ఆ పని చేయను అని వైసీపీ పెద్దలకు ఊరటను ఇచ్చే ముచ్చటనే చెప్పారు. ఇక విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారని అన్నారు. ఆయన ఏ పరిషితులలో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు అన్నారు. ఇకపోతే పార్టీకి చెందిన ఎంపీ రాజీనామా చేస్తే తిరిగి ఆ సీటు తాము గెలుచుకోలేని స్థితిలో ఉన్నామని ఆయన చెప్పడం విశేషం. అవును వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మొత్తానికి పిల్లి మొగ్గలు వేయను అని పిల్లి గట్టిగానే చెప్పారు. చూడాలి మరి వైసీపీలో ముందు ముందు ఎవరు ఏ రూటు తీసుకుంటారో.