ఒకే టైంలో నిద్రపోయిన పైలెట్.. కోపైలెట్.. దారి తప్పిన ఫ్లైట్
విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. పైలెట్.. కో పైలెట్ ఇద్దరూ ఒకే టైంలో నిద్ర పోవటం.. ఫ్లైట్ దారి తప్పిన ఈ ఉదంతం ఇండోనేషియాలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 10 March 2024 4:41 AM GMTమీరు చదివింది అక్షర సత్యం. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. పైలెట్.. కో పైలెట్ ఇద్దరూ ఒకే టైంలో నిద్ర పోవటం.. ఫ్లైట్ దారి తప్పిన ఈ ఉదంతం ఇండోనేషియాలో చోటు చేసుకుంది. 153 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. జనవరి 25 ఈ దారుణ తప్పిదం చోటు చేసుకుంది. అయితే.. చివర్లో నిద్ర లేచిన కెప్టెన్ కారణంగా పెను ముప్పు తప్పింది. అసలేమైందంటే..
బాలిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం నలుగురు సిబ్బందితో.. 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరింది. జర్నీ మొదలైన కాసేపటికి కో పైలెట్ నుంచి అనుమతి తీసుకున్న ప్రధాన పైలెట్ నిద్ర పోయాడు. ఫ్లైట్ ను తన నియంత్రణలోకి తీసుకున్న కో పైలెట్ కాసేపటికే నిద్రలోకి జారుకున్నాడు.
విమానం వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలోకి వెళుతున్న విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్ విభాగం గుర్తించింది. దీంతో వారు పైలెట్లను సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్ సెంట్రల్ వారు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేసినా అవేమీ ఫలించలేదు. ఇదే సమయంలో విమానం దారి తప్పింది. ఇదేమీ తెలియని ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరువ అవుతున్నట్లుగా భావించారు.
ఇలాంటి విపత్కర వేళ.. 28 నిమిషాల నిద్ర తర్వాత లేచిన ప్రధాన పైలెట్.. కోపైలెట్ కూడా నిద్ర పోతున్న విషయాన్ని గుర్తించారు. తాను వెళ్లాల్సిన దారిలో వెళ్లటం లేదని గుర్తించి.. వెంటనే గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందిని సంప్రదించటం.. వారితో కాంటాక్టులోకి వెళ్లిన తర్వాత దారి తప్పిన విమానాన్ని సరైన మార్గంలోకి వెళ్లేలా చేశారు. చివరకు జకర్తా ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఇష్యూలో ఇద్దరు పైలెట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. స్థానికంగా అన్ని విమానాల సేవల నిర్వహణ తీరును రివ్యూ చేయనున్నట్లు చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సదరు ఫ్లైట్ లో ప్రయాణించిన 153 మంది ప్రయాణికులకు ఈ విషయం తెలిస్తే మాత్రం.. కాసేపు గుండె జారిపోవటం ఖాయమని మాత్రం చెప్పకతప్పదు.