గాల్లో ఉండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. ఆ లేడీ పైలెట్ ఏమైందో తెలుసా?
మరి అలాంటిది ఆకాశంలో ఉండగా విమానం పైకప్పు ఎగిరిపోతే ఎలా ఉంటుందో ఊహించండి..
By: Tupaki Desk | 26 Jun 2024 7:16 AM GMTమిద్దె మీద నడుస్తున్నప్పుడు కాస్త అడుగు తడబడితేనే మనకు గుండె గొంతులోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. మరి అలాంటిది ఆకాశంలో ఉండగా విమానం పైకప్పు ఎగిరిపోతే ఎలా ఉంటుందో ఊహించండి..
సాధారణంగా విమానంలో ప్రయాణించడం అంటే చాలా మంది భయపడతారు. సాఫీగా సాగే ప్రయాణమైనప్పటికీ విమానం గాల్లో ఉన్న సమయంలో కాస్త కుదుపులకు గురి అయితే గుండెలు గుబేల్ మంటాయి. మరి అలాంటిది ఏకంగా ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు విమానం పైకప్పు ఊడిపోతే.. ఆలోచించడానకే భయంకరంగా ఉంది కదూ. అయితే ఒక మహిళా పైలట్ ఎంతో చాకచక్యంగా ఇటువంటి అనుభవాన్ని ఫేస్ చేసి ప్రాణాపాయాన్ని తృటిలో తప్పించుకుంది. ఇంతకీ ఆ పైలెట్ ఎవరో.. ఆమె విమానాన్ని ఎలా కిందకు దింపిందో తెలుసుకుందాం పదండి..
ఈ సంఘటన జరిగి ఇప్పటికి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తోంది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తేలికపాటి విమానంతో గగనతలంపై విన్యాసాలు చేస్తున్న మహిళా పైలట్ ఊహించని అనుభవం ఎదుర్కొంది. విమానం గాల్లో ఉండగానే సడన్గా దాని పై కప్పు కాస్త ఓపెన్ అయిపోయింది. అయితే తన కంగారును అదుపులోకి తెచ్చుకొని కాసేపు అలాగే గాల్లో ప్రయాణించి చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంలో ఆ పైలెట్ సక్సెస్ అయ్యింది.
తనకు ఎదురైనటువంటి ఈ భయంకరమైన అనుభవం గురించి.. తృటిలో తప్పిన ప్రమాదం గురించి సదరు పైలెట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా పైలట్ నరైన్ మెల్కుమ్జాన్ తేలికపాటి విమానంతో టేక్ ఆఫ్ తీసుకుంది. మెల్లిగా గగనతలంలోకి వెళ్లిన తర్వాత తన విమానంతో విన్యాసాలు చేయడం ప్రారంభించింది. అయితే అనూహ్యంగా విమానం పైకప్పు తెరుచుకుంది.
“ఎన్నో సంవత్సరాలుగా నేను తీసుకున్న ఎరోబాటిక్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు అదే విమానం లో ప్రయాణించినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ఆరోజు వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది.. నేను నడుపుతున్న ‘ఎక్స్‌ట్రా 330LX విమానం’ గాల్లో ఉండగా సడన్గా పైకప్పు తెరుచుకొని పగిలిపోయింది. కాసేపు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు” అని మెల్కుమ్జాన్ తన అనుభవం గురించి వివరించారు.
“కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోక ముందే నేను శిక్షణకు వెళ్లి తప్పు చేశానా అన్న భావన నాకు అప్పుడే కలిగింది. టేక్ ఆఫ్ కి ముందు సరైన తనిఖీలు చేసి ఉంటే ఈ పరిస్థితి అసలు వచ్చేది కాదేమో. పైగా నేను ఆ సమయంలో కంటి రక్షణకు కళ్ళజోడుని కూడా ధరించలేదు. దీంతో ఊపిరి తీసుకోలేక ,సరిగ్గా చూడలేక ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నాను.అవి నా జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు. విమానం భారీ శబ్దం కారణంగా రేడియోలో కోచ్ ఏం చెబుతున్నారు అన్న విషయం కూడా నాకు వినిపించలేదు. కానీ ఏం జరిగినా ఎగురుతూనే ఉండండి.. అన్న ఒక్క మాట మాత్రం నాకు స్పష్టంగా గట్టిగా వినిపించింది.” అని మెల్కుమ్జాన్ అన్నారు.
అంతేకాదు పైలట్గా తాను ఎదుర్కొన్న ఈ ఎక్స్పీరియన్స్‌ని ఎంతో ఆలస్యంగా బయటపెడుతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే తన అనుభవం మిగిలిన పైలట్లకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే తాను ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా బయటపడిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.