Begin typing your search above and press return to search.

పిన్నెల్లి ఎంట్రీ.. నరసరావుపేటలో ఎక్కడెక్కడకు వెళ్లారు?

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి మిస్సింగ్ అయ్యారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లే.

By:  Tupaki Desk   |   29 May 2024 4:12 AM GMT
పిన్నెల్లి ఎంట్రీ.. నరసరావుపేటలో ఎక్కడెక్కడకు వెళ్లారు?
X

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి మిస్సింగ్ అయ్యారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లే. కీలక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీకి సంబంధించిన పరిణామాలు అందరిని ఆకర్షించాయి.అందులో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పోలింగ్ వేళ పోలింగ్ బూత్ లోకి వెళ్లి.. అక్కడి ఈవీఎంను ధ్వంసం చేసిన వైనానికి సంబంధించిన వీడియో వైరల్ కావటం.. ఈ ఉదంతంపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం సీరియస్ కావటం తెలిసిందే.

అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టుకు పోలీసులు పరుగులు తీయటం.. అంతలోనే ఆయన కనిపించకుండా పోయారన్న వార్తలు సంచలనంగా మారాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెన్ను చూపకుండా ధైర్యంగా నిలిచే ఆయన.. మాచర్ల నుంచి ఎస్కేప్ అయ్యారన్న వాదనలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆయన హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు.. హైడ్రామా అనంతరం ఆయన కనిపించకుండా పోవటం తెలిసిందే.

అనంతరం ఆయన అరెస్టుపై కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆయనకు అరెస్టు ముప్పు తప్పటం తెలిసిందే. అయినప్పటికి పిన్నెల్లి ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న దానిపై అయోమయం నెలకొంది. దీనికి తెర దించుతూ తాజాగా ప్రత్యక్షం అయ్యారు పిన్నెల్లి. మిస్సింగ్ అయ్యారన్న వార్తలు జోరుగా వచ్చిన ఐదారు రోజుల అనంతరం మంగళవారం రాత్రి ఆయన నరసరావుపేటకు చేరుకున్నారు. పట్టణంలోకి అడుగు పెట్టటంతోనే ఆయన.. హోటల్ జూపల్లి వద్ద ఆగారు.

అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. రోజూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాలకు తగ్గట్లే ఎస్పీ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. సంతకం చేశారు. ఈవీఎం ధ్వంసం.. మాచర్ల హింసకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఇతర కేసుల్లో ఆయన్ను జూన్ 6వరకు అరెస్టు చేయొద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఈ కేసుల తదుపరి విచారణ జూన్ ఆరుకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలకు తగ్గట్లే.. ఎస్పీ ఆఫీసులో సంతకం కోసం పిన్నెల్లి వచ్చారు.

ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలి రావటంతో సందడి వాతావరణం నెలకొంది. దీంతో.. ఇంతకాలం ఆయన మిస్ అయ్యారన్న వార్తలకు చెక్ పడినట్లుగా చెప్పాలి. విదేశాలకు వెళ్లిపోయారన్న వార్తలు జోరుగా వినిపించిన దానికి భిన్నంగా.. ఆయన నేరుగా నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన అనుచర వర్గం.. అభిమానులు పిన్నెల్లి రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా.. పిన్నెల్లికి ఉన్న మొండి ధైర్యమే ఆయనకు ఆభరణంగా చెప్పక తప్పదు.