Begin typing your search above and press return to search.

కీలక షరతులు... పిన్నెల్లికి అంతలోనే షాకిచ్చిన హైకోర్టు..!

అయితే.. తాజాగా దీనికి సంబంధించిన తీర్పు కాపీ వెలుగులోకి వచ్చింది. ఇందులో పిన్నెల్లికి హైకోర్టు విధించిన ఆసక్తికరమైన షరతు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 May 2024 3:47 AM GMT
కీలక షరతులు... పిన్నెల్లికి అంతలోనే  షాకిచ్చిన హైకోర్టు..!
X

గతకొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల ఫలితాలపై చర్చలతో పాటు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించిన చర్చ, వార్తలు, కథనాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాజాగా మరో షాక్ తగిలింది.

అవును... మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... వెబ్ క్యాస్టింగ్ కి సంబంధించిన ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపైనా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ సమయంలో ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్న పిన్నెల్లికి తిరిగి హైకోర్టు షాకిచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించిన ఎన్నికల కమిషన్ వెబ్ క్యాస్టింగ్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణకు పరారైనట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సంగారెడ్డిలో పట్టుబడ్డారంటూ కథనాలూ వచ్చాయి. అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో... పిన్నెల్లి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా వేసింది. అయితే.. తాజాగా దీనికి సంబంధించిన తీర్పు కాపీ వెలుగులోకి వచ్చింది. ఇందులో పిన్నెల్లికి హైకోర్టు విధించిన ఆసక్తికరమైన షరతు హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా... ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ 4న పిన్నెల్లిని మాచర్లకు రాకుండా నిషేధం విధించింది హైకోర్టు. మాచర్లలో పోటీ చేసిన అభ్యర్ధి అయినప్పటికీ ఈవీఎం ధ్వంసం ఘటనను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ రోజు పట్టణంలోకి రాకుండా నిషేధం విధించింది. అయితే... ఆయన్ను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మాత్రం ఉండేందుకు అనుమతించింది.

ఇదే సమయంలో... ఈ కేసులో గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడకూడదు.. సాక్షులను కలవడానికి వీల్లేదు.. వారిని ప్రభావితం చేయొద్దు.. అనుచరుల చర్యలకు ఆయనే బాధ్యత తీసుకోవాలి.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత రామకృష్ణారెడ్డిదే అంటూ కోర్టు పలు కండిషన్స్ పెట్టింది.