Begin typing your search above and press return to search.

వీటి నుంచి తప్పించుకోలేకపోయిన పిన్నెల్లి!

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై దాఖలైన నాలుగు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా వాటిని హైకోర్టు కొట్టేసింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 7:29 AM GMT
వీటి నుంచి తప్పించుకోలేకపోయిన పిన్నెల్లి!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంల విధ్వంసం, దీన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై దాఖలైన నాలుగు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా వాటిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పటిష్ట భద్రత మధ్య ఆయనకు నరసరావుపేటలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జూన్‌ 26 అర్థరాత్రి మాచర్లలో జడ్జి ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా న్యాయస్థానం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించింది, దీంతో ఆయనను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మరోవైపు అరెస్టు చేసేటప్పుడు పోలీస్‌ వాహనంలో కాకుండా పిన్నెల్లి కారులో ఆయనను స్టేషన్‌ కు తరలించడం విశేషం.

కాగా కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జైలు బయట, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ 2012లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేసి ఉప ఎన్నికలో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పిన్నెల్లికి ప్రభుత్వ విప్‌ పదవి దక్కింది.

2024 ఎన్నికల్లో మాచర్ల నుంచి మరోసారి వైసీపీ తరఫున పోటీ చేసి తొలిసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందారు.

కాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గాన్ని మరో చంబల్‌ లోయగా మార్చారని టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి.. పలువురు టీడీపీ కార్యకర్తలను హత్య చేయించారనే ఆరోపణలు చేసింది. అంతేకాకుండా దౌర్జన్యం, అధికారుల అండతో టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేయడం వంటి అభియోగాలు పిన్నెల్లి సోదరులపై ఉన్నాయి.

ఇప్పుడు తాజా ఎన్నికలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెద్ద ఎత్తున అభియోగాలు నమోదయ్యాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో ఆయనపై నేరపూరిత కుట్ర, ప్రజాప్రాతినిధ్య చట్టం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

అలాగే ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై పిన్నెల్లితోపాటు మరో 15 మందిపై రెంటచింతల పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.

తనను ప్రశ్నించిన నాగశిరోమణి అనే మహిళను అసభ్యంగా దూషించడంపైనా పిన్నెల్లిపై దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509, 131 (2ఆర్‌పీఏ 1951) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మే 14న మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వారి అనుచరులతో కలసి కారంపూడిలోని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. దీన్ని అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులు, మరికొందరిపై సెక్షన్‌ 307, 332, 143, 147, 324, 149, 435, 427 కింద కేసు నమోదుచేశారు.