Begin typing your search above and press return to search.

పిన్నెల్లికి 'సిట్' షాక్.. ధైర్యం వచ్చిన తర్వాతే వీడియో బయటకు!?

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లటం.. నేరుగా ఈవీఎం ఉన్న కౌంటర్ లోకి వెళ్లి

By:  Tupaki Desk   |   22 May 2024 5:00 AM GMT
పిన్నెల్లికి సిట్ షాక్.. ధైర్యం వచ్చిన తర్వాతే వీడియో బయటకు!?
X

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లటం.. నేరుగా ఈవీఎం ఉన్న కౌంటర్ లోకి వెళ్లి.. దాన్ని రెండు చేతులతో పట్టుకొని నేల కేసి బలంగా విసిరికొట్టిన వైనానికి చెందిన వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడెక్కడో మారుమూల బిహార్ లోనూ.. పశ్చిమబెంగాల్ లోనూ అయితే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా ఏపీలోని ఒక నియోజకవర్గంలో ఇలా జరగటమా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసపై సరైన రీతిలో మీడియా కవరేజ్ లేదన్న మాట వినిపిస్తోంది.

విషయాన్ని విషయంగా చెప్పకుండా.. తమకు తగ్గట్లుగా మార్చుకొని ప్రసారం చేసిన నీలి మీడియా పుణ్యమా అని వాస్తవం వెలుగులోకి రావటానికి నానా కష్టం పడాల్సి వచ్చింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచక వీడియో అసలు ఎలా బయటకు వచ్చింది? దాని క్రెడిట్ ఎవరికి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పిన్నెల్లి ఎపిసోడ్ అందరికి తెలిసినప్పటికీ ఎవరూ దాన్ని బయటకు చెప్పే ధైర్యం చేయలేదు. చివరకు మీడియాకు సైతం సమాచారం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఏపీ హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావటం.. నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాల నేపథ్యంలో సిట్ ఏర్పాటైంది. పోలింగ్ అనంతరం హింస చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో పర్యటించిన సిట్ టీం.. అక్కడి వారందరిని కలవటంతో.. అసలేం జరిగిందన్న వివరాల్ని లోతుగా సేకరించారు. ఈ క్రమంలో సిట్ అధికారుల తీరుతో ధైర్యం తెచ్చుకున్న అధికారుల్లో కొందరు ముందుకు రావటంతో వీడియో అంశం వెలుగు చూసిందని చెబుతున్నారు.

ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోను చూసిన సిట్ సిబ్బంది సైతం విస్మయానికి గురయ్యారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవటంపై పోలీసులకు గట్టిగా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. పిన్నెల్లి అరాచకాలకు అంతే లేకుండా పోతుందన్న మాటే తప్పించి ఎలాంటి చర్యలు లేని వేళలో.. సిట్ ఎంట్రీతో భారీ షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు.