Begin typing your search above and press return to search.

ఈవీఎంను పగలకొట్టింది పిన్నెల్లి కాదట!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 July 2024 6:20 AM GMT
ఈవీఎంను పగలకొట్టింది పిన్నెల్లి కాదట!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగులకొట్టడం వెబ్‌ క్యామ్‌ల సాక్షిగా వెలుగుచూసింది. అంతేకాకుండా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపైన పిన్నెల్లి అనుచరులు దాడి చేయడం, బయట ఒక మహిళకు పిన్నెల్లి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇవన్నీ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వెబ్‌ క్యామ్‌ ల్లోనే నిక్లిప్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పిన్నెల్లిపై పలు కేసులను నమోదు చేయించింది. అలాగే సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న పిన్నెల్లిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించారు.

ఈ నేపథ్యంలో పిన్నెల్లి సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. తాను అసలు పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదని చెప్పినట్టు సమాచారం. ఈవీఎంను తాను పగలగొట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని ప్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది.

అలాగే ఆరోజు తన వెంట గన్‌ మెన్లు కూడా లేరని పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. వెబ్‌ క్యామ్‌ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాదు. వాటిని సాక్షాత్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వెబ్‌ క్యామ్‌ ల సాక్షిగా పిన్నెల్లి అరాచకాలు బట్టబయలైనా ఆయన ఆ రోజు పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదని చెబుతుండటం గమనార్హం. అలాగే ఈవీఎంను తాను పగలకొట్టలేదని, నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా తెలియదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతేకాకుండా మే 13న పోలింగ్‌ ముగిశాక మరుసటి రోజు అంటే మే 14న కార్యకర్తలకు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడ్డారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి. ముఖ్యంగా విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేయడంతో కేసు కూడా నమోదైంది,

ఈ నేపథ్యంలో ఈ అన్ని కేసులకు సంబంధించి పిన్నెల్లిని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు జడ్జి నుంచి అనుమతి తీసుకున్నారు. పిన్నెల్లి నాలుగు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు.

దీంతో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో 11 మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకుని పిన్నెల్లిని విచారించారు. ఈ క్రమంలో పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగ్గా.. దాదాపు 30 ప్రశ్నలకు పైగా ‘తెలియదు.. గుర్తు లేదా.. మర్చిపోయా’ రీతిలో సమాధానాలు ఇచ్చారని టాక్‌. ఈ నేపథ్యంలో జూలై 9న కూడా ఆయనను పోలీసులు విచారించనున్నారు.