జనసైనిక్స్ గుండెల్లో పవన్ తరువాత ఆయనే !
జనసైనికులకు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ అభిమానం అన్న పదాలు చాలవు. వారిది ఆరాధన. భక్తి అంటే చాలా వరకు సమంజసంగా ఉంటుంది
By: Tupaki Desk | 17 May 2024 12:30 AM GMTజనసైనికులకు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ అభిమానం అన్న పదాలు చాలవు. వారిది ఆరాధన. భక్తి అంటే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. పవన్ వాళ్ళకు దేవుడు. ఆయన్ని ఏమైనా అంటే వారు సహించలేరు. జీవితకాలం శతృత్వం పెంచుకుంటారు. అదే పవన్ కి ఎవరినా మాట మాత్రం సాయం చేసినా వారిని ఆజన్మాత్రం ప్రేమిస్తూనే ఉంటారు.
ఇలా జనసైనికుల ఆగ్రహం అభిమానం రెండూ పవన్ కోణం నుంచే ఉంటూ వస్తాయి. పవన్ సెంట్రిక్ గానే వారి ఆలోచనలు సాగుతాయి. పవన్ తప్ప వారికి వేరే ప్రపంచం ఉండదు. ఇదిలా ఉంటే పవన్ తరువాత వారు ఇపుడు అత్యధికంగా మరో వ్యక్తిని ప్రేమిస్తున్నారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు పిఠాపురం వర్మ.
ఈయన ఈ ఏడాది మార్చి వరకూ నియోజకవర్గం నాయకుడే. ఇపుడు స్టేట్ వైడ్ ఫిగర్ అయిపోయారు. దానికి కారణం పవన్ పిఠాపురంలో పోటీ చేయడం. ఆయనకు వర్మ సాయం అందించడం ఇదంతా అందరికీ తెలిసిందే. తెలుగుదేశం నేత అయిన వర్మకు సొంతంగా బలం ఉంది. ఒక ఇమేజ్ ఉంది. ఆయన 2014లో 47 వేల భారీ మెజారిటీతో ఇండిపెండెంట్ గా గెలిచారు అంటేనే అర్థం చేసుకోవాలి వర్మ తప్ప పిఠాపురంలో బిగ్ ఫిగర్ ఎవరూ లేరని.
అలాంటి వర్మ 2024 ఎన్నికల్లో గెలిచేందుకు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్న వేళ పవన్ పిఠాపురం వైపు వచ్చారు ఆయన కోసం వర్మ భారీ త్యాగం చేశారు. చంద్రబాబు సైతం వర్మకు నచ్చచెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మంచి పదవితో గౌరవిస్తామని చెప్పారు.
దాంతో వర్మ అలుపెరగని తీరున పవన్ కోసం కష్టపడ్డారు అనే చెప్పాలి. పిఠాపురంలో పవన్ గెలుపు వెనక వర్మ ఉంటారు అన్నది కచ్చితమైన విషయం. పవన్ సైతం వర్మని చాలా దగ్గరకు తీసుకున్నారు. ఇటు లక్షలాది మంది జన సైనికులు వర్మ తోనే నడచారు. వర్మ సైతం వారి ఆశలు వమ్ము కానీయలేదు.
ఇదిలా ఉంటే మే 16న వర్మ జన్మ దినం. దాంతో సోషల్ మీడియా అంతా వర్మకు అభినందనలు చెబుతూ ఒక మోత మోగింది. జనసైనికులు అయితే మీ త్యాగం కష్టం గుర్తు పెట్టుకుంటాం వర్మ గారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్లు చేసి ట్రెడింగ్ క్రియేట్ చేశారు.
'మీరు ఇచ్చిన మద్దతును మర్చిపోలేము.. గొప్ప లీడర్ అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్‌లో కూడా వర్మగారు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. జనసైనికులు ఇలా వర్మకు పుట్టిన రోజు సందర్భంగా వర్మకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వర్మకు జనసైనికులు విషెస్ చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే వర్మ జనసైనికుల గుండెలలో ఎంతలా గూడు కట్టుకున్నారో అర్ధం చేసుకోవల్సిందే.
పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉంటే వర్మ పిఠాపురం లో మకాం వేసి అంతా చూసుకున్నారు. ఆయన తనదైన శైలిలో రచించిన వ్యూహాలు వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడులు తట్టుకుని మరీ నిలిచిన తీరుతో ఇపుడు పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలుస్తారు అన్నది అంతా అంటున్న మాట. దాంతో వర్మ జనసైనికుల హృదయాలలో ఎక్కడికో వెళ్ళిపోయారు. నిజంగా వర్మకు ఇది తన జీవితంలో మరపురాని పుట్టిన రోజుగానే అంతా చూస్తున్నారు.