Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కల్యాణ్‌కు బ్యాడ్ న్యూస్‌.. పిఠాపురంలో ర‌గ‌డ‌!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇది ఒక‌ర‌కంగా బ్యాడ్ న్యూసేన‌ని చెప్పాలి. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   27 Feb 2025 9:30 AM GMT
ప‌వ‌న్ కల్యాణ్‌కు బ్యాడ్ న్యూస్‌.. పిఠాపురంలో ర‌గ‌డ‌!
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇది ఒక‌ర‌కంగా బ్యాడ్ న్యూసేన‌ని చెప్పాలి. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి పెట్టింది. అంతేకాదు.. ప్ర‌త్యేక అధికారుల‌ను హుటాహుటిన అక్క‌డ‌కు పంపిస్తున్న ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వివేక్ యాద‌వ్ మీడియాకు చెప్పారు. దీంతో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యం ఆస‌క్తిగా మారింది.

ఏం జ‌రుగుతోంది?

ఏపీలో గురువారం ప‌ట్ట‌భ‌ద్ర‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లా, ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ ప‌ట్ట‌భ‌ద్ర స్థానాల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా సాగుతోంది. ఎక్క‌డా వివాదాలు లేవు. అయితే.. ఓటింగ్ శాతం మాత్రం భారీగా ప‌డిపోయింది. దీంతో ఓట‌ర్ల‌ను బూతుల‌కు తీసుకువ‌చ్చేందుకు పోటీలో ఉన్న అభ్య‌ర్థులు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే పిఠాపురంలో వివాదంగా మారింది.

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం తూర్పు గోదావ‌రి ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ అభ్య‌ర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్‌కు కీల‌కంగా మారింది. ఈ స్థానం నుంచి బ‌రిలో ఉన్న స్వ‌తంత్ర అభ్య‌ర్థి, మాజీ ఎంపీ జీవీ హ‌ర్ష‌కుమార్ త‌న‌యుడికి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ల‌బిస్తోంది. దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు.. కూట‌మి పార్టీల నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఫోన్ల ద్వారా సందేశాలు పంపుతున్నారు. ఇదేస‌మ‌యంలో ఓటుకు నోటు కూడా ఇస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం.

ఓటేస్తే.. రూ.2500 నుంచి 4000 వ‌ర‌కు ఇస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ అయ్యాయి. స్థానిక మునిసిప‌ల్ క‌ల్యాణ మండ‌పాన్ని అడ్డాగా చేసుకుని.. ఓ కానిస్టేబుల్‌ను కాప‌లా పెట్టి మ‌రీ ఇక్క‌డ డ‌బ్బులు పంచుతున్న‌ట్టు ప్ర‌చారం రావ‌డం.. దీనికి సంబంధించి వీడియోలు వైర‌ల్ కావ‌డంతో ఎన్నిక‌ల సంఘం అలెర్ట్ అయింది. వెంట‌నే ఉన్న‌తాధికారుల‌ను రంగంలోకి దింపి.. క‌ల్యాణ మండ‌పాన్ని సీజ్ చేయ‌డంతోపాటు.. డ‌బ్బులు పంచుతున్న‌వారిని అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది.