Begin typing your search above and press return to search.

పిఠాపురం వ‌ర్మకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే జ‌రిగేది ఇదే.!

ప్ర‌స్తుతం ఏపీలో మ‌రో ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వ‌చ్చే నెల 20న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 10:30 PM GMT
పిఠాపురం వ‌ర్మకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే జ‌రిగేది ఇదే.!
X

ప్ర‌స్తుతం ఏపీలో మ‌రో ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వ‌చ్చే నెల 20న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈమొత్తం 5 స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఉన్న నేప‌థ్యంలో వైసీపీ దాదాపు ఈ పోటీలోనూ ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. 5 స్థానాల్లో ఒక‌టి ఇప్పటికే జ‌న‌సేన‌కు రిజ‌ర్వ్ అయింది. ఈ సీటు నుంచి జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు నాగ‌బాబు పోటీ చేయ‌డం ఖాయంగా మారింది.

గ‌తంలోనే నాగ‌బాబును మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పిన ద‌రిమిలా.. ఇప్పు డు వ‌చ్చిన ఎమ్మెల్సీల‌లో ఒక‌టి జ‌న‌సేన‌కు కేటాయించ‌నున్నారు. ఇక‌, మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవ‌రు బ‌రిలో ఉంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇత‌రుల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ఇద్ద‌రు నాయ‌కులు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఒక‌రు మైల‌వ‌రం టికెట్‌ను గ‌త ఎన్నిక‌ల్లో త్యాగం చేసిన దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. మ‌రొక‌రు.. పిఠాపురం టికెట్‌ను వదులుకున్న వ‌ర్మ‌.

ఈ ఇద్ద‌రికీ చంద్ర‌బాబు బ‌ల‌మైన హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. రోజులు, వారాలు.. నెల‌లు గ‌డుస్తున్నా. వీరికి ఇచ్చిన హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌చ్చిన అవ‌కాశం మేర‌కు దేవినేనికి ఒక సీటు రిజ‌ర్వ్ చేశార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, కీల‌క‌మైన వ‌ర్మ ప‌రిస్థితి ఏంట‌నేది మ‌రో ఆస‌క్తిక‌ర అంశం. ఆయ‌న పిఠాపురం నుంచి పోటీకి సిద్ధ‌మైన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు సూచ‌నల‌ మేర‌కు ఆయ‌న వ‌దులుకున్నారు.

అంతేకాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యానికి కూడా వ‌ర్మ కృషి చేశారు. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో తాజాగా అయినా.. ఆయ‌న‌కు అవ‌కాశం చిక్కుతుందా? లేక‌.. పిఠాపురంలో అధికార ఆధిప‌త్యం పోరు పెరుగుతుంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో వెన‌క్కి త‌గ్గుతారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ద‌క్క‌క‌పోతే.. మ‌రో ఏడాది పాటు ఎదురు చూడ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.