ఫస్ట్రేషన్.. పీచేముడ్.. పిఠాపురం వర్మ యూటర్న్ వెనుక కథేంటి?
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ తాజాగా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 21 Feb 2025 6:30 AM GMTపవన్ కళ్యాణ్ కోసం త్యాగశీలిగా మారిన పిఠాపురం టీడీపీ ఇన్ చార్జి వర్మ కక్కలేక మింగలేని పరిస్థితుల్లో ఉన్నారా? నిన్న సీరియస్ గా పవన్ కు వ్యతిరేకంగా పరోక్ష వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అది వైరల్ కావడంతో ఇప్పుడు ‘అబ్బే అది నేను పోస్ట్ చేయలేదంటూ కవర్ చేయడం చూస్తుంటే.. ఆయనలో అంతులేని ఆవేదన ఏమైనా దాగి ఉందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానపడుతున్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేయడం.. ఆయన డిప్యూటీ సీఎం కావడం.. తనకు కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కకపోవడంతో ఈనేత చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో ఇలాంటి అసంతృప్తి సెగలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి..
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ తాజాగా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. "కష్టపడి సాధించే విజయానికే గౌరవం" అంటూ పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లో ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోలో వర్మ స్వయంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆసక్తికరంగా ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.
-జనసేన వర్గాల్లో ఆగ్రహం
వర్మ పెట్టిన ట్యాగ్ లైన్, వీడియో కంటెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా కష్టపడి గెలవలేదన్న సూచన కనిపిస్తోంది. తానే కష్టపడి పవన్ గెలుపుకు కృషి చేశానన్న భావన అందులో స్పష్టంగా ఉందని జనసేన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్‌పై జనసేన శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వర్మపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.
-తీవ్ర విమర్శలతో ట్వీట్ తొలగింపు
సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన వర్మ, తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. అంతేకాకుండా, దీనికి తనకెలాంటి సంబంధం లేదంటూ వరుస వివరణలు ఇచ్చారు. ఈ ట్వీట్ తన హైదరాబాద్ సోషల్ మీడియా టీమ్ నుంచి పొరపాటుగా పోస్ట్ అయిందని స్పష్టం చేశారు.
- వర్మ అసంతృప్తి నిజమేనా?
వర్మ వివరణ ఇచ్చినా, రాజకీయ వర్గాల్లో అతని అసంతృప్తి గురించి చర్చ కొనసాగుతోంది. పిఠాపురంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జనసేన నేతల తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ అసంతృప్తి వల్లే ఆ ట్వీట్ బయటికి వచ్చిందని కొందరు విశ్లేషిస్తున్నారు.
-భవిష్యత్తులో కీలక పరిణామాలు?
ట్వీట్ వివాదం తాలూకూ దుమారం చల్లారినప్పటికీ, వర్మ భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ గెలుపులో తన పాత్రను హైలైట్ చేసేందుకు చేసిన ప్రయత్నం వివాదాస్పదమవడంతో, టీడీపీ-జనసేన మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందా అనే చర్చ జరుగుతోంది. వర్మ పదవి వచ్చేదాకా ఇలా అసమ్మతిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.