లక్ష మెజారిటీ : పిఠాపురంలో గ్రౌండ్ రియాలిటీ ఇదే...!
ఏపీలో హాట్ ఫేవరేట్ సీటు ఏది అంటే పిఠాపురం అని ఠక్కున చెప్పేయవచ్చు.
By: Tupaki Desk | 1 April 2024 4:27 AM GMTఏపీలో హాట్ ఫేవరేట్ సీటు ఏది అంటే పిఠాపురం అని ఠక్కున చెప్పేయవచ్చు. ఏపీలో సోషల్ మీడియా తో పాటు అన్ని రకాల మీడియాలలో పిఠాపురం గురించే వేడెక్కించే చర్చ సాగుతోంది. పిఠాపురంలో ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఒక చర్చ అయితే గెలిచిన వారి మెజారిటీ ఎంత అన్నది మరో చర్చ.
అయితే వీటితో సంబంధం లేకుండా రెండు పార్టీల అభ్యర్ధులు మాత్రం లక్ష ఓట్ల మెజారిటీ అని పక్కా క్లారిటీతో చెప్పేస్తున్నారు. అసలు ఈ లక్ష మాట అన్నది మొదట జనసేన వైపు నుంచే. పవన్ ని లక్ష మెజారిటీతో పవన్ గెలవ బోతున్నారు అని చెబుతూ వచ్చారు.
పవన్ సైతం ఇపుడు అదే మాట అంటున్నారు. ఆయన తన ఎన్నికల ప్రచార సభను పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలా గెలిపిస్తారు అని కూడా ఆయన ధీమాగా చెప్పేశారు.
జనసేన లెక్కలు దీనికి అనుగుణంగా పవన్ తో పాటు ఆ పార్టీ వారు వేసుకుంటున్నారు. బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు తొంబై వేల పై చిలుకు ఉన్నాయని, దాంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు సైతం పవన్ కి ఓట్లు వేస్తారు అని అంచనా కడుతున్నారు. అంటే మొత్తం రెండు లక్షల ముప్పయి వేల పై చిలుకు ఓట్లలో లక్షా ఎనభై వేల దాకా ఓట్లు పోల్ అయితే అందులో లక్షా ముప్పయి నుంచి నలభై వేల దాకా జనసేనకే పడతాయని భావిస్తున్నారుట.
ఇక ఆ మిగిలిన నలభై నుంచి యాభై వేల ఓట్లు మాత్రమే వైసీపీకి వస్తాయి. అలా లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యమే అని జనసేన ఊహిస్తోందిట. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా తనకే లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని అంటున్నారు.
దానికి కారణం 2019లో వైసీపీకి 83 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆ విధంగా చూస్తే లక్ష పై దాటి తామే ఓట్లు తెచ్చుకుంటామని వైసీపీ భావిస్తోంది. అలాగే కాపులలో సగానికి పైగా ఓట్లు తమకూ పడతాయని బీసీలు ఎస్సీలు ఇతర సామాజిక వర్గాల ఓట్లలో నూటికి ఎనభై శాతం తమకే పడతాయని అలా మొత్తం పోల్ అయిన ఓట్లలో ఎనభై శాతం తమకే వస్తాయని భావిస్తోంది.
అయితే రెండు పార్టీల లెక్కలు ఇలా ఉంటే అసలు లక్ష ఓట్ల మెజారిటీ ఎవరికైనా వస్తుందా అన్నది బిగ్ క్వశ్చన్ ఎందుకంటే మొత్తం ఓట్లు పోల్ అయ్యేదే లక్షా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా మాత్రమే. అంతా ఏకపక్షంగా ఎన్నిక జరగదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్ధికి 2019లో వచ్చిన ఓట్లు 28 వేలు దాకా మాత్రమే. అదే టీడీపీ వర్మ 2019లో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు అరవై ఎనిమిది వేల చిల్లరగా ఉంది. ఈ రెండూ కలుపుకుంటే 96 వేల ఓట్లు అవుతాయి. అయితే వర్మ అభ్యర్ధి కారు అనుకుంటే ఆయనకు పడే ఓట్లు పవన్ కి పడతాయా అన్నది ఒక డౌట్.
ఇక జనసేన టీడీపీ ఓట్ల సర్దుబాటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. గతసారి అన్ని సీట్లతో పాటుగా పిఠాపురం ఉంది. ఇపుడు టీడీపీ అధినాయకత్వం ఎంతవరకూ ఫోకస్ చేస్తుందో తెలియదు కానీ వైసీపీ హై కమాండ్ మాత్రం ఫుల్ అటెన్షన్ పెట్టేస్తుంది. దాంతో పాటు పొత్తుల వల్ల పడే ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా అన్నది చూడాలని అంటున్నారు.
ఇలా చాలా లెక్కలు బేరీజు వేసుకున్నపుడు ఎవరికీ లక్ష ఓట్ల మెజారిటీ అయితే రాదు అనే అంటున్నారు. వర్మకు 2014లో 47 వేల పై చిలుకు మెజారిటీ ఇండిపెండెంట్ గా వచ్చింది అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఒక పార్టీ గుర్తు మీద వెళ్ళినపుడు ఆ ఓట్లు పరిమితంగా ఉంటాయి ఇంకా చాలా అంశాలు తోడు అవుతాయి. ఈ నేపధ్యంలో పవన్ మీద వెల్లువలా అభిమానం కురిసినా ఆయనకు వచ్చే మెజారిటీ వర్మకు వచ్చిన మెజారిటీని ఎంతో కొంత దాటినా అది గ్రాండ్ సక్సెస్ అనుకోవాలి అంటున్నారు.
ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు 2009లో కేవలం వేయి ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇపుడు దానికి వంద రెట్లు మెజారిటీ ఆమె ఆశిస్తున్నారు. పవన్ కాదు అనుకుంటే గీత అందుబాటులో ఉంటే నేత అవుతారు అనుకుంటే మాత్రం ఆమెకు టైట్ ఫైట్ లో వచ్చే మెజారిటీ పది నుంచి పదిహేను వేల మధ్య ఉన్నా ఉండవచ్చు అంటున్నారు. అంతే తప్ప లక్ష మెజారిటీ ఎటూ రాదు అన్నది గ్రౌండ్ రిపోర్ట్.