పిఠాపురంలో బెట్టింగ్ పరిస్థితిపై వైరల్ ఆడియో... విన్నారా..?
మరోపక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాల చివరి రోజు చివరి మీటింగ్ ని పిఠాపురంలోనే నిర్వహించారు వైఎస్ జగన్.
By: Tupaki Desk | 1 Jun 2024 9:40 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి చివరిదశకు చేరుకుంది. మే 13న ముగిసిన పోలింగ్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం (జూన్ 1) విడుదలవుతుండగా.. ఎగ్జాట్ ఫలితాలు మంగళవారం (జూన్ 4) వెలువడనున్నాయి. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నింటికీ, కీలక నేతలందరికీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరు జోరుగా సాగుతున్నాయని అంటున్నారు.
ఈ సమయంలో అధికారంలోకి ఎవరొస్తారు అనే విషయంపై ఎంత ఆసక్తి ఉందో... అదే స్థాయిలో పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపుర్ నియోజకవర్గాలపైనా ఉన్న పరిస్థితి. ఈ సమయంలో ప్రధానంగా బెట్టింగులు మాత్రం పిఠాపురం ఫలితాలపైనే మరింత ఎక్కువగా సాగుతున్నాయనే ప్రచారం బలంగా నడుస్తుంది. ఈ సమయంలో ఒక ఆడియో వైరల్ గా మారింది.
అవును... గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో ఓటమి పాలైన పవన్ కల్యాణ్.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని, నిలవాలని గట్టి పట్టుదల మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఎన్నో సమీకరణల అనంతరం పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం హోరెత్తిపోయింది.
ఇందులో భాగంగా పవన్ కు మద్దతుగా బుల్లి తెర నటులు, సినిమా నటులు, సాంకేతిక నిపుణులు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలువురు హీరోలు, వారి కుటుంబ సభ్యులు పిఠాపురంలో ప్రచారాలతో హోరెత్తించేశారు. గడప గడపకూ వెళ్లి పవన్ కోసం ప్రచారం చేశారు. దీంతో... పవర్ స్టార్ కోసం ఇలా స్టార్ క్యాంపెయినర్లంతా పోటా పోటీగా ప్రచారం చేయడంతో పిఠాపురంలో రాజకీయ వాతావరణం విపరీతంగా వేడెక్కిపోయింది.
మరోపక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాల చివరి రోజు చివరి మీటింగ్ ని పిఠాపురంలోనే నిర్వహించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన... తన తల్లి, తన అక్క లాంటి వంగ గీతను గెలిపిస్తే... ఉప ముఖ్యమంత్రిని చేసి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాయనని భారీ హామీ ఇచ్చారు. దీంతో... పిఠాపురంలో లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ స్థాయిలో జరిగిన పిఠాపురం ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనంతరం పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఫలితాల కోసం ప్రజలు అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈగ్యాప్ లో బెట్టింగ్ రాయళ్లు హల్ చల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... పవన్ గెలుపుపై కాకుండా.. ఆయనకు భారీ మెజారిటీ వస్తుందనే విషయంపై బలమైన బెట్టింగ్ జరుగుతుండటం గమనార్హం.
ఈ క్రమంలో... పవన్ కల్యాణ్ కచ్చితంగా గెలుస్తారనే ధీమా జనసైనికుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, లోకేష్ లకంటే ఎక్కువ మెజారిటీ పవన్ కు వస్తుందనే విషయంపై 1:5 నిష్పత్తిలో బెట్టింగ్ జరుగుతుందని తెలిపే ఒక ఆడియో వైరల్ గా మారింది.
అంటే... ఈ ఎన్నికల్లో పవన్ కు అందరికంటే ఎక్కువ మెజారిటీ వస్తే ఇవతలి వ్యక్తి లక్ష రూపాయలు చెల్లించాలి. అలా కాకుండా పవన్ ఓడిపోయినా, అత్యల్ప మెజారిటీ వచ్చినా అవతలివారు ఐదు లక్షల రూపాయలు ఇస్తారన్నమాట! ఈ స్థాయిలో పిఠాపురంలో ఎన్నికల ఫలితాల బెట్టింగులు జరుగుతున్నాయి. మరి అసలు ఫలితాలు ఏమి చెప్పబోతున్నాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ సందడి మామూలే!