పిఠాపురం ఎమ్మెల్యే ఎంత జీతం తీసుకుంటారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్లుగా జరిగినట్లు ఫలితాలు వెలువడిన తర్వాత తెలిసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Jun 2024 3:04 PM GMTఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్లుగా జరిగినట్లు ఫలితాలు వెలువడిన తర్వాత తెలిసిన సంగతి తెలిసిందే. 175 స్థానాల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. దీంతో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రానిపరిస్థితి.
అయితే కూటమి ఈ స్థాయిలో రాణించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషించారనేది నిర్వివాదాంశం అనే చెప్పుకోవాలి. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట పవన్ చేసిన వ్యాఖ్యలు... ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చేశాయనే కామెంట్లు వినిపించాయి.
ఇక గతంలో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పూర్తిస్థాయిలో పోరాటపటిమ చూపించారు పవన్. ఈ క్రమంలో ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ నుంచి పోటీ చేసి 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది ఒక చరిత్ర అనే చెప్పాలని అంటున్నారు జనసైనికులు.
ఇలా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కల్యాణ్ తీసుకోబోయే వేతనం ఎంత అనే విషయంపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అందుకు ఒక బలమైన కారణం ఉంది. ఇందులో భాగంగా... తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి జీతం తీసుకుంటానని పవన్ తెలిపారు. దీంతో ఆయన జీతం ఎంతనేది ఆసక్తిగా మారింది.
అయితే... పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 3.35 లక్షల రూపాయలు జీతం అందుకోనున్నారు. ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇతర అలవెన్సులను అన్నీ కలిపి రూ.3.365 లక్షల జీతం ఇస్తారు. దీంతో... పవన్ కల్యాణ్ జూలై నుంచి ఈ జీతం అందుకోనున్నారు! కాగా... దేశంలో అత్యధికంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు రూ. 4 లక్షల జీతం అందుకుంటున్నారు!