Begin typing your search above and press return to search.

పిఠాపురానికి గుడ్ న్యూస్... డిప్యూటీ సీఎం కన్ఫాం..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపూ జూన్ 4 వైపే ఉంది.

By:  Tupaki Desk   |   16 May 2024 2:30 PM GMT
పిఠాపురానికి గుడ్  న్యూస్... డిప్యూటీ సీఎం కన్ఫాం..!?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపూ జూన్ 4 వైపే ఉంది. ఆ రోజు కోసం కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ లోపు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉండగా.. మరికొంతమంది వారి వారి ధీమాలపై బెట్టింగులకూ దుగుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి మాత్రం డిప్యూటీ సీఎం పదవి కన్ఫాం అని అంటున్నారు!

అవును... ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనేది తెలిసిన విషయమే. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ వెళ్లాలనే పట్టుదలపై ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది!

పైగా... 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో ఈసారి భారీ మెజారిటీపై పవన్ భారీ ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిచే అసెంబ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. పవన్ గెలుపుకోసం జనసైనికులు, సినీ జనాలు, కుటుంబ సభ్యులు కూడా పట్టుదలతో ఎవరి స్థాయిలో వాళ్లు పనిచేశారు.

మరోవైపు వంగా గీత కోసం వైసీపీ అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేసిందని చెబుతున్నారు. ఇక గీత గెలుపు విషయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ప్రిసేట్జ్ గా తీసుకున్నారు. పైగా వృద్ధులూ, మహిళలూ భారీగా పోలింగ్ లో పాల్గొనడంతో గీత తన గెలుపు పై పూర్తి ధీమాతో ఉన్నారు.

మూడుసార్లూ త్రిముఖ పోటీ!:

2009 నుంచి చూస్తే... పిఠాపురం నియోజకవర్గంలో ప్రతీసారీ బలమైన త్రిముఖ పోటీనే జరిగింది. ఇందులో భాగంగా... 2009లో పీఆర్పీ నుంచి వంగ గీత, టీడీపీ నుంచి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముగ్గురికీ 40వేల పైచులుకు ఓట్లు రాగా.. వంగ గీత 1,036 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికలో ముగ్గురి మధ్యా టఫ్ ఫైట్ నడిచింది.

ఇక 2014 విషయానికొస్తే... ఈసారి వర్మకు టీడీపీ టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక వైసీపీ నుంచి పెండెం దొరబాబు, టీడీపీ నుంచి పీవీ విశ్వం బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 15 వేలకు పరిమితమవ్వగా... వైసీపీ అభ్యర్థికి 50వేలు, వర్మకు 97వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి!

ఇలా ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మ 2019లో టీడీపీ టిక్కెట్ దక్కించుకుని మరోసారి బరిలోకి దిగారు. ఈసారి కూడా త్రిముఖ పోరే నెలకొంది. ఇందులో భాగంగా... టీడీపీ నుంచి వర్మ, వైసీపీ నుంచి దొరబాబుతో పాటు జనసేన నుంచి శేషు కుమారి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన ఆమెకు 28వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

ఇక మిగిలిన టీడీపీ అభ్యర్థి వర్మకు 68 వేలు, దొరబాబుకు 83వేల పైచిలుకు ఓట్లు రావడంతో వైసీపీ అభ్యర్థికి 14,992 ఓట్ల మెజారిటీ దక్కింది. అయితే 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మ జనసేనకు మద్దతివ్వాల్సి రాగా.. జనసేన నుంచి పోటీ చేసిన శేషు కుమారి ఇటీవల వైసీపీలో జాయిన్ అయ్యారు. పెండెం దొరబాబూ వైసీపీలో ఉన్నారు. దీంతో... ఈసారి ఏ పార్టీకి ఏస్థాయి మెజారిటీ రాబోతుందనేది ఆసక్తిగా మారింది.

డిప్యూటీ సీఎం కన్ఫాం!:

అయితే... అత్యంత రసవత్తరంగా జరిగిన పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ గెలిచినా.. వైసీపీ నుంచి వంగ గీత గెలిచినా డిప్యూటీ సీఎం కన్ ఫాం అని అంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవ్వడం ఎంత గ్యారెంటీనో.. పవన్ కు డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా అంతే గ్యారెంటీ అని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క... పిఠాపురంలో తన అభ్యర్ది వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని జగన్ ఇప్పటికే బలమైన హామీ ఇచ్చారు. ఒకవేళ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి పిఠాపురంలో వంగ గీత గెలవకపోయినా.. కాపు వర్గం ఖాతాలో ఆమెకు జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

దీంతో... పిఠాపురంలో ఎవరు గెలిచినా, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా... ఆ నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు!! అయితే... ఆ డిప్యూటీ సీఎం ఎవరనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకూ ఆగాల్సిందే!