Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మకు బాబు గిఫ్ట్ అదేనా ?

ఈసారి ఎన్నికల్లో స్టేట్ వైడ్ ఫిగర్ గా ఎదిగిన నేత పిఠాపురం వర్మ. ఆయన పొలిటికల్ ఎంట్రీ 2009లో జరిగింది

By:  Tupaki Desk   |   31 May 2024 3:35 AM GMT
పిఠాపురం వర్మకు బాబు గిఫ్ట్ అదేనా ?
X

ఈసారి ఎన్నికల్లో స్టేట్ వైడ్ ఫిగర్ గా ఎదిగిన నేత పిఠాపురం వర్మ. ఆయన పొలిటికల్ ఎంట్రీ 2009లో జరిగింది. ఆయన తన రాజకీయ జీవితాన్ని పిఠాపురానికే అంకితం చేసి అక్కడ నుంచే అంతా అనుకున్న వారు. 2014లో ఇండిపెండెంట్ గా అత్యధిక మెజారిటీతో గెలిచి టీడీపీ అధినాయకత్వం దృష్టిలో పడిన వర్మకు ఆనాడే మంత్రి పదవి దక్కాలి.

కానీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సామాజిక సమీకరణలలో భాగంగా బీసీలకు కాపులకు క్యాబినెట్ లో నాడు బాబు స్థానం కల్పించారు. ఇక 2019లో వర్మకు మరోసారి టికెట్ దక్కినా ఓటమి పాలు అయ్యారు. 2024 కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన ఆయన వైసీపీ నుంచి ఎవరినైనా ఓడిస్తాను అని చెప్పేశారు. అలాంటి టైం లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు.

దాంతో వర్మ వర్గం బేజారు అయింది. అయితే చంద్రబాబు నచ్చచెప్పారు. వర్మకు కీలక హామీ ఇచ్చారు అని ప్రచారం జరిగింది. అంతే కాదు కాకినాడ పిఠాపురంలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వర్మకు టీడీపీ కూటమి ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పారు.

ఇక చంద్రబాబు విదేశాల నుంచి టూర్ ముగించుకుని గురువారం ఉండవల్లి రాగానే ఆయన నివాసంలో వర్మ కలసి ముచ్చటించారు. తనకు పిఠాపురంలో అప్పగించిన బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నెరవేచిన సంగతిని చెప్పారు. జనసేనకు ఎంత మెజారిటీ వస్తుందో కూడా బాబుకూ చెప్పేశారు. మీడియాకూ చెప్పేశారు. దాంతో బాబు వర్మకు శభాష్ అని మెచ్చుకున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వర్మకు బాబు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ కచ్చితంగా మంత్రి అవుతారు. ఆయన కనుసన్నలలోనే గోదావరి జిల్లా రాజకీయం అంతా సాగుతోంది. పవన్ బిగ్ ఫిగర్. పైగా ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయనతో పోటీ పడి వెలగడం నిలవడం కూడా కష్టమే.

మరి వర్మకు ఏమి ఇస్తారు అంటే అర్జంటుగా ఎమ్మెల్సీ పదవి అయితే ఇవ్వవచ్చు అని అంటున్నారు. వైసీపీ వరసబెట్టి ముగ్గురు నలుగురు మీద అనర్హత వేటు వేసి దాదాపుగా నాలుగు ఖాళీలను అట్టే బెట్టింది. అలా టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి అందులో తొలి ప్రాధాన్యతగా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారు అని అంటున్నారు.

అంటే ఎమ్మెల్యే కావాల్సిన వర్మ ఎమ్మెల్సీ అవుతారు అన్న మాట. మరి అంతకు మించి ఆయనకు ప్రాధాన్యత ఉంటుందా అంటే లేదు అనే అంటున్నారు. వర్మ విషయానికి వస్తే పిఠాపురంలో స్థానికంగా తన నాయకత్వంలోనే రాజకీయం మొత్తం సాగాలని ఉందని అంటున్నారు. అయితే జనసేన వేరే పార్టీ. పవన్ గెలిచిన తరువాత ఆయన మంత్రిగా ఉంటూ పార్టీ అధినేతగా బిజీగా ఉండే నేపధ్యంలో తన తరఫున నియోజకవర్గం చూసే బాధ్యతలను తన సోదరుడు నాగబాబుకు అప్పగిస్తారు అని అంటున్నారు.

అలా నాగబాబుకు పిఠాపురం ఇంచార్జి హోదా కల్పిస్తారు అని అంటున్నారు. జనసైనికులు కూడా అదే కోరుకుంటున్నారు అని అంటున్నారు. మరి వర్మ వర్గీయులు మాత్రం పవన్ ని భుజాన మోసి గెలిపించడంలో కృషి చేసిన వర్మకే బాధ్యతలు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు. ఆయన లోకల్ పర్సన్ అని ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి అన్నీ ఆయనకు తెలుస్తాయని అంటున్నారు.

అయితే జనసేన ఒక రాజకీయ పార్టీగా బలపడాలి అంటే నాగబాబుకే బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ అన్నది గాజు గ్లాస్ పార్టీలో వినిపిస్తున్న మాట. మొత్తానికి పిఠాపురం వర్మ రాజకీయ జాతకం కూడా రేపటి ఫలితాల తరువాత పూర్తిగా డిసైడ్ అవుతుందని అంటున్నారు.