దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు.. భారతీయులపై పిట్రోడా సంచలన వ్యాఖ్యలు !
మన దేశ ప్రజలను విభజించి మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడుందని మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 8 May 2024 10:37 AM GMTమనదేశ ప్రజల గురించి కాంగ్రెస్ సీనియర్ శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వారు ఆఫ్రికన్ల మాదిరి, ఉత్తరాది వారు తెల్లవారి మాదిరి, పశ్చిమం దిక్కు వారు అరబ్బుల్లాగా, తూర్పున ఉండేవారు చైనీయుల్లాగా ఉంటారని పేర్కొనడం వివాదానికి కారణమైంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. మన దేశ ప్రజలను విభజించి మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడుందని మండిపడుతున్నారు.
మన రూపురేఖల గురించి పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీస్తన్నాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత శర్మ స్పందిస్తూ తాను ఈశాన్య భారతానికి చెందిన వాడినే కానీ భారతీయుడిలానే కనిపిస్తా. అని తన మనసులోని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల్లో చిచ్చు రేపే ఇలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని పేర్కొన్నారు. మనలో విద్వేషాలు నింపే ఇలాంటి మాటలు సరైనవి కావని హితవు పలికారు.
బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పుబట్టారు. విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ఇప్పటికి కూడా పాటిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సైతం పిట్రోడా వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అలా మాట్లాడాల్సింది కాదని చెప్పారు. ఇటీవల వారసత్వ పన్ను గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ నైజం బయటపడిందన్నారు. దేశ ప్రజల్లో మంట పెట్టే ఉద్దేశంతోనే పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. ప్రజల్లో ఐక్యత కోసం పాటుపడుతుంటే పిట్రోడా మాత్రం మంటలు రేపుతున్నారు. మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిట్రోడా దీనికి సమాధానం చెప్పాల్సిందేనని గుర్తు చేశారు.
ఎవరు ఎన్ని విధాలా మన ఐక్యతను దెబ్బ తీయాలని చూసినా కుదరదు. మన ప్రజలు అంత తేలిగ్గా ఇతరుల మాటలు పట్టించుకోరు. మన వర్ణ వ్యవస్థను గురించి కామెంట్ చేయాల్సిన అవసరం వారికి ఏముంది? మన దేశ పరిస్థితుల వల్ల మనకు రంగు, రూపు వస్తాయి. అంతమాత్రాన ఎవరో చెప్పడం మనకు ఇష్టం ఉండదని మోదీ తనదైన శైలిలో సమాధానం చెప్పడం గమనార్హం.