Begin typing your search above and press return to search.

పవన్ ని కంట్రోల్ చేయడానికే పీకేని తెచ్చారా...!?

అయితే జనసేన కోరుకున్న సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి ఏమిటి అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. దాంతో పీకేని సడెన్ గా ఎంట్రీ చేయించారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 8:06 AM GMT
పవన్ ని కంట్రోల్ చేయడానికే పీకేని తెచ్చారా...!?
X

ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకున్న తరువాత ఒకప్పుడు వైసీపీ శిబిరంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే పసుపు శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు. గట్టిగా మూడు నెలలు కూడా ఎన్నికలు లేని వేళ పీకే టీడీపీతో చేతులు కలపడాన్ని ఎలా చూడాలి అన్న దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో పవన్ కళ్యాణ్ అనే ఒక పీకే ఉన్నారు.

ప్రశాంత్ కిశోర్ అలియాస్ మరో పీకే అవసరమా అన్న చర్చ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి గ్లామర్ ఇవ్వడానికి పవన్ ఉన్నారు. ఆయన పొత్తు కలిపి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు.

ఒక విషయం చెప్పాలీ అంటే పవన్ పార్టీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఒకే రీజియన్ లో ఎక్కువగా బలం ఉంది. అలాగే పవన్ ఓటు బ్యాంక్ టీడీపీ ఓటు బ్యాంక్ రెండూ కూడా దాదాపుగా ఒక్కటే. దాంతో పవన్ ఈ పొత్తులో భాగంగా అడుగుతున్న సీట్లు అన్నీ కూడా టీడీపీకి బాగా బలమున్న సీట్లే కావడం విశేషం. పొత్తు పార్టీగా జనసేన డిమాండ్లు వేరే లెవెల్ లో డిమాండ్లు పెడుతోంది అని ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా గోదావరి జిల్లాలలోనే ఎక్కువ సీట్లను కోరుకుంటోంది. దాంతో టీడీపీ కి జనసేనకు మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఎక్కువ సీట్లు బలమైన సీట్లు గెలుపు అవకాశాలు ఉండే సీట్లు జనసేనకు ఇచ్చేస్తే ఇక టీడీపీకి లాభమేంటి అన్న చర్చ కూడా వస్తోంది.

దాంతో పాటు టీడీపీ ఎపుడూ పొత్తు పార్టీల డిమాండ్ల కు తలొగ్గిన ప్రసక్తి అయితే లేదు. అలాగే టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలు అన్నీ కూడా జూనియర్ పార్టనర్స్ గానే ఉన్నాయి. అయితే పవన్ పార్టీ అలా కాదు, ఈ రెండు పార్టీలు ఫస్ట్ టైం పొత్తులో ఉన్నాయి. అదే సమయంలో జనసేన అధినేత పవన్ గ్లామర్ కూడా ఉండడంతో పాటు బలమైన సామాజికవర్గం వంటివి అన్నీ కూడా ఆ పార్టీ చూపించి ఎక్కువ సీట్లు కోరుతోందని అంటున్నారు.

అయితే జనసేన కోరుకున్న సీట్లు ఇస్తే టీడీపీ కి మిగిలేవి ఏమిటి అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. దాంతో పీకేని సడెన్ గా ఎంట్రీ చేయించారు అని అంటున్నారు. పీకే మరోసారి రెండు పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో సర్వే చేస్తారు అని అంటున్నారు. ఆ సర్వే అనంతరం పీకే ఒక రిపోర్ట్ ఇస్తారని దాని ప్రకారమే టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి, జనసేన ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నది డిసైడ్ అవుతుంది అంటున్నారు.

అంటే అపుడు జనసేన కోరుకున్న సీట్లు కావు, పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ సూచించిన సీట్లే జనసేనకు దక్కుతాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే జనసేనను కంట్రోల్ లో పెట్టడానికే ప్రశాంత్ కిశోర్ ని తెచ్చారని అంటున్నారు. దీని వల్ల తాము అనుకున్న సీట్లు తాము కోరుకున్న ప్రాంతాల్లో ఇవ్వవచ్చు అని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు.

మరి ఈ లేటెస్ట్ పరిణామాల పట్ల జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక ఒరలో రెండు కత్తులు అన్నట్లుగా టీడీపీ శిబిరంలో ఇద్దరు పీకేలు ఇపుడు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు పీకేల మధ్య సామరస్యం కుదురుతుందా టీడీపీకి అటూ ఇటూ పవన్ ప్రశాంత్ కలసి నడుస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.