Begin typing your search above and press return to search.

రేస్ కోర్స్ రోడ్ నుంచి రాజమహేంద్రవరం..పదేళ్లలో పేరు మార్పులెన్నో?

వలసవాదుల తాలూకు ఆనవాళ్ల నుంచి బయటకు రావాలనే ఉద్దేశంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 12:30 AM GMT
రేస్ కోర్స్ రోడ్ నుంచి రాజమహేంద్రవరం..పదేళ్లలో పేరు మార్పులెన్నో?
X

వలసవాదుల తాలూకు ఆనవాళ్ల నుంచి బయటకు రావాలనే ఉద్దేశంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ వలసవాదులు అంటే బ్రిటీష్ వారు అని అర్థం. ఇంకా బీజేపీ కోణంలో చెప్పాల్సి వస్తే మొఘలుల పాలన కూడా. అందుకే పట్టణాలు, నగరాలు, ప్రదేశాలకు వారు పెట్టిన పేర్లను మారుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చింది. శ్రీ విజయపురంగా దీనికి నామకరణం చేసింది. అయితే, ఇదే మొదటిది కాదు. గత పదేళ్లలో చూస్తే.. ప్రసిద్ధ ప్రాంతాలు సహా చారిత్రక నగరాల పేర్లు ఎన్నో మారాయి.

అయోధ్య నుంచి చూసినా..

గోదావరి, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంగా పేరుగాంచింది యూపీలోని అలహాబాద్ నగరం. దీనిని ప్రయాగ రాజ్ గా మార్చారు. ఒకప్పుడు చాలా ప్రాశస్త్యం పొందిన అలహాబాద్.. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు చాలా దగ్గరి సంబంధాలున్న నగరం. రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని వీపీ సింగ్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇక అలహాబాద్ హైకోర్టు అంటనే అనేక సంచలనాకలు కేంద్ర బిందువు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదనే తీర్పునిచ్చింది ఈ హైకోర్టే. ఇక హిందువులు అత్యంత ఆరాధించే శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. అంతకుముందు ఇది ఫైజాబాద్ జిల్లాలో ఉండేది. ఆ జిల్లా పేరును అయోధ్యగా మార్చారు. హరియాణ-ఢిల్లీ సరిహద్దులోని హరియాణకు చెందిన ప్రాంతం గుడ్ గావ్. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కలిసిపోయింది. దీంతో గుడ్ గావ్ కాస్త గుర్ గామ్ గా మార్చారు.

మన రాజమండ్రి.. రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం తెలుగు పుస్తకాల్లో చదువుకున్న పేరు ఇది. కానీ, బ్రిటిష్ కాలంలో నోరు తిరగక రాజమండ్రిగా మార్చారు. అయితే 2015 తర్వాత విభజిత ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చింది. జార్ఖండ్ లోని నగర్ ఉంతారిని శ్రీ బన్ శీధర్ గానూ, ఛత్తీస్ గడ్ రాజధాని న్యూ రాయ్ పూర్ ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ పేరిట అటల్ నగర్ గానూ మార్చారు.

బాద్ లు పోయాయి..

మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ నర్మదాపురం అయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఛత్రపతి శంబాజీ నగర్ గా, ఉస్మానాబాద్ ధారా శివ్ గా రూపాంతరం చెందాయి. ప్రధాని నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్ ను లోక్ కల్యాణ్ మార్గ్ గా, రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది. ఇండియా గేట్ వద్ద కింగ్ జార్జి విగ్రహాన్ని తొలగించి అక్కడ భారీ నేతాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అండమాన్ నికోబార్ ద్వీపాల సముదాయంలోని మూడు ద్వీపాల పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుస్తకంలో పేర్కొన్న విధంగా మార్చారు. అండమాన్, నికోబార్ ద్వీపాల్లోని నీల్ ఐలండ్ ను `షహీద్ ద్వీప్` గా, హావెలాక్ ఐలండ్ ను `స్వరాజ్ ద్వీప్` గా మార్చారు. మరో ద్వీపమైన రాస్ ఐలండ్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా నామకరణం చేశారు. కాగా, ఎడాపెడా పేర్ల మార్పుపై కొన్ని విమర్శలూ ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం మతపరమైన కోణం ఉందనే విశ్లేషకులు ఆరోపిస్తుంటారు.