Begin typing your search above and press return to search.

అలర్ట్‌.. పెంపుడు జంతువుల నుంచే ఈ వ్యాధి!

ప్లేగు వ్యాధి మనదేశంలో అంతరించి చాలా కాలమవుతోంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధి అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసింది

By:  Tupaki Desk   |   11 Feb 2024 12:30 PM GMT
అలర్ట్‌.. పెంపుడు జంతువుల నుంచే ఈ వ్యాధి!
X

ప్లేగు వ్యాధి మనదేశంలో అంతరించి చాలా కాలమవుతోంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధి అగ్రరాజ్యం అమెరికాలో వెలుగుచూసింది. జంతువులు, పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వ్యాధి.. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, కళ్ల వాపు, ఒళ్లు నొప్పులు వంటివాటికి కారణమవుతోంది. ఇది బ్యుబోనిక్‌ ప్లేగ్‌ అని చెబుతున్నారు.

అమెరికాలో 2016లో ప్లేగు వ్యాధి బారిన చాలామంది పడ్డారు. అప్పట్లో చాలా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసులు తగ్గిపోయాయి. మళ్లీ ఇప్పుడు బ్యుబోనిక్‌ ప్లేగ్‌ ఒక వ్యక్తిలో వెలుగుచూడటం ఆందోళన రేపుతోంది. పెంపుడు జంతువులు అయిన కుక్కలు, పిల్లుల నుంచి కూడా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తోందని చెబుతున్నారు.

తాజాగా అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. అక్కడ ఒక వ్యక్తికి తన పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రీవెంట్‌ వెల్లడించింది.

సాధారణంగా అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లోనే ఈ ప్లేగ్‌ వ్యాధి అధికంగా ఉండేది. న్యూ మెక్సికో, నార్తర్న్‌ అరిజోనా, సదరన్‌ కొలరాడో, కాలిఫోర్నియా, సదరన్‌ ఒరెగాన్, నెవడాల్లో గతంలో ఈ వ్యాధి వెలుగుచూసింది.

ఈ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్లేగు వ్యాధి బయటపడింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2016 తరువాత ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్లేగు వ్యాధిని దేశం నుంచి తరిమికొట్టామంటూ అమెరికా ప్రభుత్వం అప్పట్లో ప్రకటన కూడా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒరెగాన్‌ రాష్ట్రంలో ప్లేగు వ్యాధి వెలుగుచూడటం ఆందోళన రేపింది. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, వాపు.. వంటి లక్షణాలు ఆ వ్యక్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని వైద్యుల పరిశీలనలో ఉంచారు. అతడికి తగిన వైద్యాన్ని అందిస్తున్నారు. పెంపుడు పిల్లి ద్వారానే అతడికి ఈ వ్యాధి సోకిందని అమెరికా వైద్య విభాగం వెల్లడించింది.