90 ఏళ్లలో.. దేశాధినేతలను మింగేసిన విమాన ప్రమాదాలు
ఇప్పుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో మరోసారి ఇరాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది
By: Tupaki Desk | 20 May 2024 4:30 PM GMTప్రపంచంలో పెద్ద దేశాల్లో ఒకటైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం యావత్ ప్రపంచాన్ని కలవర పరిచింది. అమెరికాతో కయ్యానికి దిగుతూ.. ఆ దేశానికి కంటగింపుగా మారిన ఇరాన్ ఓ దశలో డర్టీ కంట్రీగానూ పిలిపించుకుంది. అయినప్పటికీ తనదైన పట్టును విడవకుండా పశ్చిమాసియాలో కీలక దేశంగా నిలిచింది. ఇక ఇరాన్ అంటే గుర్తుకొచ్చేది ఇటీవలి హిజాబ్ వివాదం నుంచి ఇజ్రాయెల్ పై దాడి వరకు. గత నెలలో ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ను ఇజ్రాయెల్ దాడి చేసి చంపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇబ్రహీం రైసీ దుర్మరణంతో మరోసారి ఇరాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.
గతంలోనూ కొందరు దేశాధినేతలు
1936 నుంచి చూస్తే పలువురు దేశాధినేతలు విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 1936లో స్వీడన్ ప్రధాని లిడ్మాన్, 1957లో ఫిలప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే, 1958లో బ్రెజిల్ ప్రెసిడెంట్ నెరేయు, 1966లో ఇరాక్ అధ్యక్షుడు ఆరిఫ్, 1967లో బ్రెజిల్ మరో అధినేత బ్రాంకో, 1987లో లెబనాన్ ప్రధాని రషీద్, 1998లో పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ విమాన దుర్ఘటనల్లో కన్నుమూశారు.
బ్రెజిల్ అధ్యక్షులు రెండుసార్లు
పదేళ్లలో బ్రెలిల్ ఇద్దరు అధ్యక్షులు విమాన ప్రమాదాల్లో దుర్మరణం పాలవడం గమనార్హం. ఇక పాకిస్థాన్ లో ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చిన జనరల్ జియా ఉల్ హక్ కూడా ఇలానే ప్రాణాలు కోల్పోయారు. మరో గమనార్హమైన విషయం ఏమంటే.. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరిట ఇస్తున్న మెగసెసే అవార్డు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరుగాంచింది. భారత్ కు చెందిన పలువురు నాయకులు, వ్యక్తులకు సైతం మెగసెసె అవార్డు దక్కింది.