వైరల్ విజువల్స్... బ్రెజిల్ లో కూలిన విమానం.. 61 మంది మృతి!
ఈ ఘటనపై బ్రెజిల్ ప్రెసిడేంట్ లూయిజ్ ఇనాసెయో లులాడా సిల్వా స్పందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు, స్నేహితులకు సంఘీభావం ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Aug 2024 5:21 AM GMTబ్రెజిల్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ విమాన ప్రమాదం జరిగింది. 57 మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్నట్లు చెబుతున్న విమానం గాల్లో చెక్కర్లు కొడుతూ సావో పువాలోలోని రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 61 మందీ మృతి చెందారని తెలుస్తోంది.
అవును... ఏటీఆర్ 72 ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ అనే విమానం 57 మంది ప్రయాణులు, నలుగురు సిబ్బందితో సావో పాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తుందగా అది విన్ హెడోలో కూలిపోయిందని వోపాస్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫుటేజ్ వైరల్ గా మారింది.
ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం... ఈ విమానం బ్రెజిలియన్ రాష్ట్రంలోని పరానాలోని కాస్కావెల్ నుంచి బయలుదేరి.. సావో పాలో రాష్ట్రంలోని గ్వార్ల్ హౌస్ కు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:21 గంటల వరకూ 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణించిన ఆ విమానం అనంతరం ఒక్క నిమిషంలోనే అంతెత్తు నుంచి కిందపడిపోయిందని చెబుతున్నారు.
ఈ ఘటనపై బ్రెజిల్ ప్రెసిడేంట్ లూయిజ్ ఇనాసెయో లులాడా సిల్వా స్పందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు, స్నేహితులకు సంఘీభావం ప్రకటించారు. ఇదే క్రమంలో.. సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సియో గోంస్ డి ప్రిటాస్ స్పందిస్తూ... మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అధికారులు... విమానం నివాస ప్రాంతంలో ల్యాండ్ అయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. స్థానికంగా ఉన్న కాండోమినియం కాంప్లెక్స్ లోని ఓ ఇల్లు మాత్రమే దెబ్బతిన్నదని అన్నారు. ఇదే సమయంలో... ఫ్లైట్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. విచారణ జరుగుతుందని వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నట్లు తెలిపారు.