Begin typing your search above and press return to search.

రుషికొండ ప్యాలెస్ మీద కూటమి సూపర్ ప్లాన్

ఎందుకంటే పర్యాటకుల కోసం దానిని రిసార్ట్స్ గా వాడుదామని అనుకుంటే అది అత్యధికంగా ఉంది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 5:30 AM GMT
రుషికొండ ప్యాలెస్ మీద కూటమి సూపర్ ప్లాన్
X

విశాఖలో రుషికొండ మీద గత వైసీపీ ప్రభుత్వం దాదాపుగా అయిదారు వందల కోట్ల రూపాయలతో అత్యంత విలాసంగా నిర్మించిన ఒక ప్యాలెస్ ని ఏం చేయాలా అని టీడీపీ కూటమి ప్రభుత్వం తలలు బద్ధలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

ఎందుకంటే పర్యాటకుల కోసం దానిని రిసార్ట్స్ గా వాడుదామని అనుకుంటే అది అత్యధికంగా ఉంది. అందులోని బాత్ రూములే బంగారంగా ఉన్నాయి. దానికి వేల ఖరీదును అద్దెగా పెట్టి బస చేసేందుకు ఏ టూరిస్టు వస్తారు అన్నది ఒక పెద్ద ప్రశ్న.

పోనీ దానిని ప్రభుత్వ సమావేశాలకు వాడుకుందామా అంటే అది దానికి కూడా అనువుగా లేదు అని అంటున్నారు. అది అధికారిక నివాసంగా ఉంది తప్పించి మరే విధంగా వాడుకునేందుకు అవకాశం లేదు అని అంటున్నారు.

దాంతో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి ఇపుడు ఒక మంచి ఆలోచన వచ్చింది అని అంటున్నారు. విశాఖపట్నం ఎటూ సినీ రాజధానిగా ఉంది. గతంలో అయితే దాదాపుగా ప్రతీ రోజూ షూటింగులు జరిగేవి. ఇపుడు కాస్తా తగ్గినా జరుగుతూనే ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఏపీలో అభివృద్ధి చేయాలని అనుకుంటోంది. దాంతో పాటుగా వారికి ఏపీకి వచ్చేందుకు అనేక రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని రుషికొండ మీద కట్టిన అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ని షూటింగులకు అద్దెకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ విధంగా ప్యాలెస్ ని ఇస్తే సినీ నిర్మాతలు దర్శకులు హీరోలు దానికి తమకు అనుకూలంగా మారుచ్కుని షూటింగులు చేస్తారని ఫలితంగా ప్రభుత్వానికి కూడా ఇతోధికంగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

నిజంగా ఇది మంచి ఆలోచనగానే చెబుతున్నారు. ఐరావతం లాంటి ఈ ప్యాలెస్ ని భరించాలి అంటే సామాన్యులకు అసలు కుదిరేది కాదని అంటున్నారు. సినీ పరిశ్రమ వారికి దీనిని ఇస్తే కనుక షూటింగులు చేయడమే కాకుండా రుషికొండ ప్యాలెస్ కి మరింత పాపులారిటీని కూడా తీసుకుని వస్తారని ఆలోచిస్తున్నారుట.

ఇక విశాఖకు తాజాగా వచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా రుషికొండ భవానాలను తొందరలోనే వినియోగంలోకి తెస్తామని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ లో ఈ భవనాలను వాడుకలోకి తీసుకుని వస్తామని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ భవనాలను పరిశీలించారు. ఆయన అక్కడ చాలా సేపు ఉండి మొత్తం చూసారు. ఆయన వెళ్లిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తోంది అంటే బహుశా ఇది పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సూపర్ ప్లాన్ అని అంటున్నారు. ఏది ఏమైనా రుషికొండ ప్యాలెస్ ని సద్వినియోగం చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

అంతే కాదు విశాఖకు షూటింగ్ స్పాట్ గా మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. రానున్న కాలంలో టాలీవుడ్ చూపు కూడా విశాఖ మీద పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం నుంచి దీని మీద ఏ కీలక ప్రకటన వెలువడుతుందో.