Begin typing your search above and press return to search.

సైన్స్ చెబుతున్న నిజం.. మనిషి కడుపులో మొక్క మొలవడం సాధ్యమేనా?

పెద్దయ్యాక అవన్నీ అబద్ధాలని తెలుస్తుంది. పొరపాటున ఏదైనా విత్తనం కడుపులోకి వెళితే, కడుపులో చెట్టు మొలుస్తుంది అని కూడా చెప్పే ఉంటారు.

By:  Tupaki Desk   |   2 April 2025 8:30 PM
సైన్స్ చెబుతున్న నిజం.. మనిషి కడుపులో మొక్క మొలవడం సాధ్యమేనా?
X

చిన్నప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పి ఉంటారు. పెద్దయ్యాక అవన్నీ అబద్ధాలని తెలుస్తుంది. పొరపాటున ఏదైనా విత్తనం కడుపులోకి వెళితే, కడుపులో చెట్టు మొలుస్తుంది అని కూడా చెప్పే ఉంటారు. ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. నిజానికి అలా జరగదని అందరికీ తెలుసు, కానీ అలా ఎందుకు జరగదో తెలుసా ?

నిజంగా కడుపులో చెట్టు మొలుస్తుందా?

నిజానికి మనం ఏదైనా విత్తనాన్ని తింటే అది మన కడుపులోపల చెట్టుగా మారడం అనేది అబద్ధం. పిల్లలు పండ్లను బాగా నమిలి తినాలని, నేరుగా మింగకూడదని చెప్పడానికి తల్లిదండ్రులు ఇలాంటి మాటలు చెబుతుంటారు. ఒకవేళ ఏదైనా విత్తనం మన కడుపులోకి వెళ్లినా, అది చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. దాని వల్ల ఎలాంటి నష్టం ఉండదు.

కడుపులో మొక్క ఎందుకు మొలవదు?

మనిషి కడుపులో చెట్టు మొలవదని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విత్తనం మొలకెత్తడానికి కావలసిన పరిస్థితులు, అంటే కాంతి, ఆక్సిజన్ , పోషకాలు అక్కడ అందుబాటులో ఉండవు. కడుపులోని యాసిడ్ కూడా మొలకెత్తడాన్ని నిరోధిస్తుంది. మానవ శరీరంలో జీర్ణవ్యవస్థ ఉంటుంది, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల విత్తనాలు కూడా పగిలిపోతాయి. దీంతో చెట్టు మొలవదు. విత్తనం మొలకెత్తడానికి సమయం కావాలి, కానీ మానవ శరీరంలో ఆహారం కొన్ని గంటల్లోనే జీర్ణమవుతుంది.

ఊపిరితిత్తుల్లో మొలకెత్తిన మొక్క

అయితే, వైద్య చరిత్రలో ఒక ఆసక్తికరమైన కేసు నమోదైంది. కడుపులో కాకపోయినా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన విత్తనం మొలకెత్తింది. ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఒక రిటైర్డ్ టీచర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా డాక్టర్ దగ్గరకు వెళ్లారు. వారి ఊపిరితిత్తులను స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. పరీక్షలో వారి ఊపిరితిత్తుల్లో బఠానీ పెరుగుతున్నట్లు తేలింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి దానిని తొలగించారు. ఇది చాలా అరుదైన సంఘటన అయినప్పటికీ, కడుపులో మొక్క మొలవడం అనేది సాధారణంగా అసాధ్యం.