Begin typing your search above and press return to search.

సాగర గర్భంలో కాలుష్య కారకాలు.. మానవాళి మనుగడకే తిలోదకాలు

సముద్రాలు కాసారాలుగా మారుతున్నాయి. వ్యర్థాలతో నిండిపోతున్నాయి. సాగర గర్బంలో కాలుష్య పదార్థాలు పేరుకుపోతున్నాయి.

By:  Tupaki Desk   |   6 April 2024 9:30 AM GMT
సాగర గర్భంలో కాలుష్య కారకాలు.. మానవాళి మనుగడకే తిలోదకాలు
X

సముద్రాలు కాసారాలుగా మారుతున్నాయి. వ్యర్థాలతో నిండిపోతున్నాయి. సాగర గర్బంలో కాలుష్య పదార్థాలు పేరుకుపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తో నిండిపోతోంది. ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు కలుస్తున్నాయి. దీంతో సముద్రాలు రిజర్వాయర్లుగా మారే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యాలు చిన్నపాటి తునకలుగా విచ్ఛిన్నమై సముద్ర అవక్షేపాల్లో కలుస్తోందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ వో) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం బయటపడింది. సాగరాల ఉపరితలాల్లో తేలుతున్న ప్లాస్టిక్ తో పోలిస్తే సముద్ర గర్బంలో వంద రెట్లు ఎక్కువ కలుస్తోందని అంచనా వేస్తున్నారు.

సముద్ర గర్బంలోకి కాలుష్యం చేరకుండా నిరోధిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలా ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఏర్పడింది. 2049 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం అధికమయ్యే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పాటించాల్సిన వారే గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా సముద్రాల మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది.

సముద్రాలు ఇలా కలుషితం అవుతుంటే పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. భూగోళం వేడెక్కుతోందని చెబుతున్నారు. మేల్కోకపోతే మానవ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరిస్తున్నారు. అయినా పెడచెవిన పెడుతున్నారు. మానవాళి మనుగడ సక్రమంగా సాగాలంటే సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనిషి తన మేథస్సుతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నా ఎన్నో తప్పులు చేస్తున్నాడు. ఇలా సముద్రాల ఉనికికే ప్రమాదం తీసుకొస్తున్నాడు. కాలుష్యం నిండిపోవడంతో అవి విషం చిమ్ముతున్నాయి. మంచి నీరు కాస్త విషపు నీరుగా మారి అనేక రోగాలకు మూలం అవుతోంది. తద్వారా వన్య ప్రాణులు సైతం అంతరిస్తున్నాయి. కొన్ని జంతువుల్లో ప్లాస్టిక్ అవశేషాలు బయట పడినట్లు తెలుస్తోంది.