Begin typing your search above and press return to search.

ఒలిపింక్స్‌లో వచ్చిన పతకంలా లేదు..!

ఇండియా తరపున కాంస్య పతకం గెలిచిన మను బాకర్‌ సైతం తన పతకం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   15 Jan 2025 6:26 AM GMT
ఒలిపింక్స్‌లో వచ్చిన పతకంలా లేదు..!
X

గత ఏడాది జరిగిన అతి పెద్ద క్రీడా ఉత్సవం ఒలిపింక్స్‌లో పతకాలు గెలుచుకున్న పలువురు క్రీడాకారులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ఉత్సవం సమయంలో నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ క్రీడాకారులు చాలా మంది ఫిర్యాదు చేశారు. ఒలిపింక్స్ క్రీడా ఉత్సవం పూర్తి అయిన తర్వాత కూడా నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చిన మెడల్స్‌ నాశిరకం ఇచ్చారు. దాంతో అవి పాడై పోతున్నాయి. వాటిపై ఉన్న పూత పోతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు ఆ మెడల్స్‌ను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో వేరే మెడల్స్ ఇస్తామని ప్రకటించింది.

ఇండియా తరపున కాంస్య పతకం గెలిచిన మను బాకర్‌ సైతం తన పతకం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తండ్రి మీడియా ముందుకు వచ్చి ఈ విషయమై స్పందించారు. ఆయన మాట్లాడుతూ... మను బాకర్‌ గెలుచుకున్న కాంస్య పతకంపై ఉన్న పూత పోతుంది. ఆ పతకం ఒలిపింక్స్‌లో వచ్చిన పతకం మాదిరిగా కాకుండా మరీ నాసి రకంగా కనిపిస్తుంది. అందుకే దాన్ని బయటకు తీయకుండా జాగ్రత్తగా దాచి పెట్టాం. దాన్ని బయటకు తీయాలి అంటే మరింతగా పాడైపోతుందేమో అని భయంగా ఉందని. ఇప్పటికే ఆ విషయాన్ని ఒలిపింక్స్ కమిటీకి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పారిస్ ఒలిపింక్స్‌లో ఇచ్చిన పతకాల విషయంలో చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపుగా వంద మంది ఆటగాళ్లు ఇప్పటికే తమ మెడల్స్‌ను వెనక్కి ఇచ్చారు. వాటి స్థానంలో వారికి కొత్త మెడల్స్ నాణ్యమైన మెడల్స్‌ను ఇచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా తరపున గెలిచిన ఇతర ఆటగాళ్లకు వచ్చిన మెడల్స్‌ కూడా రంగు పోయి మసకబారుతున్నట్లుగా కంప్లైట్స్ వస్తున్నాయి. వాటన్నింటిని వెనక్కి ఇచ్చేసి కొత్తవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ విషయమై ఇండియన్‌ ఒలిపింక్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. పతకం నాణ్యత విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. తాము ఆ మెడల్స్‌ను అంతర్జాతీయ ఒలిపింక్స్ కమిటీకి అందజేస్తాం, వాటి స్థానంలో క్రీడాకారులకు కొత్త మెడల్స్‌ను అందిస్తామని పేర్కొన్నారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని, ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని సీనియర్ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.