Begin typing your search above and press return to search.

పేక ముక్కలతో ప్రపంచ రికార్డ్... వీడియో వైరల్!

ఏకంగా 40 అడుగుల పొడవు, 16 అడుగులకు పైగా వెడల్పు, 11 అడుగులకు పైగా ఎత్తువైన నాలుగు నిర్మాణాలను పేకముక్కలతో కట్టేశాడు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 6:58 AM GMT
పేక ముక్కలతో ప్రపంచ రికార్డ్... వీడియో  వైరల్!
X

సాధారణంగా ఏదైనా బిల్డింగ్ భూకంపానికో, మరో ప్రకృత్తి విపత్తుకో కూలిపోతే.. పేక మేడలా కూలిపోయింది అంటారు. మరికొన్ని సందర్భాల్లో పేక మేడలు కడుతున్నాడు అంటూ కాస్త వెటకారంగా కూడా మాట్లాడుతుంటారు. అయితే నిజంగా పేకలతోనే మేడలు కట్టి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు ఒక యువకుడు.

అవును... నిండా పదిహేనేళ్లు లేని ఒక యువకుడు పేకలతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. పేక ముక్కలతో అతిపెద్ద నిర్మాణం కట్టి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఏకంగా 40 అడుగుల పొడవు, 16 అడుగులకు పైగా వెడల్పు, 11 అడుగులకు పైగా ఎత్తువైన నాలుగు నిర్మాణాలను పేకముక్కలతో కట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... కోల్ కతాకు చెందిన అర్నవ్ డాగా.. స్థానిక స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ఓవైపు స్కూలు పాఠాలు చదువుతూ, హోంవర్క్ చేసుకుంటూ మరోపక్క పేకముక్కలతో బిల్డింగ్ లు కట్టడం చేశాడు. అది చాలా చాలా కష్టమైందని చెబుతున్నాడు.

దీనికోసం సుమారు 41 గంటలకు పైగా సమయం పట్టిందని చెబుతున్నాడు. పట్టువదలకుండా అటు చదువును, ఇటు పేకమేడల నిర్మాణాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో తనకు చిన్నప్పటినుంఛీ ఇలా పేకముక్కలతో చిన్న చిన్న మేడలు కట్టడం అలవాటుగా మారిందని... ఈ నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ టైంలో ఈ హాబీని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నాడు.

కాగా... గతంలో బ్రయాన్ బెర్గ్ పేరుతో పేక మేడల రికార్డు ఉండేది. తాజాగా అర్నవ్ దెబ్బతో అది కాస్తా చెరిగిపోయింది. బ్రయాన్ పేకముక్కలతో మూడు మకావూ హోటళ్ల ప్రతిరూపాలను సృష్టించి రికార్డులకెక్కాగా... వాటి పొడవు 34 అడుగుల 1 అంగుళం, ఎత్తు 9 అడుగుల 5 అంగుళాల, వెడల్పు 11 అడుగుల 7 అంగుళాలు.