ఏఐతో ఉద్యోగాలు పోతాయా...జాగ్రత్త అంటున్న మోడీ !
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏఐతో మంచీ చెడ్డా రెండూ ఉన్నాయని జాగ్రత్త అన్న సందేశాన్ని ప్రపంచానికి పంపించారు.
By: Tupaki Desk | 12 Feb 2025 3:56 AM GMTకృత్రిమ మేధ ఏఐ ఇదే ఇపుడు ప్రపంచానికి తారక మంత్రంగా మారింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంగతి ఏమిటో తెలియదు. దాని లోతు పాతులు అంతకంటే తెలియదు. కానీ అది టెక్నాలజీ. సాంకేతికత విస్తరించిన తరువాత అందిపుచ్చుకున్నా లేకపోయినా దాని పని అది చేసుకుని పోతుంది. అయితే తెలివైన మానవాళి చేసేది ఏంటి అంటే దానిని మన నియంత్రణలో ఉంచుకుని మరింతగా అభివృద్ధి చెందడం.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏఐతో మంచీ చెడ్డా రెండూ ఉన్నాయని జాగ్రత్త అన్న సందేశాన్ని ప్రపంచానికి పంపించారు. ఏఐ విస్తరిస్తోంది. అయితే అది చేసే ప్రమాదాలు పక్షపాతాల గురించి గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోడీ స్పష్టం చేశారు.
ఆర్ధిక వ్యవస్థతో పాటు భద్రతాపరమైన రంగాలలో ఏఐ కొత్త పుంతలు తొక్కే సాంకేతికతను అందిస్తుందని మోడీ అన్నారు. అదే సమయంలో ఏఐ విషయంలో ప్రపంచమంతా జాగ్రత్తగా ఉండడమే కాకుండా పరస్పర సహకారం అవసరమని అన్నారు.
మరీ ముఖ్యంగా మానవ జీవితాల్లోనూ ఏఐ కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోడీ అన్నారు. ఏఐ ద్వారా ప్రపంచానికి మేలు చేసే డేటాసెట్ లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రజలే కేంద్రంగా ఏఐ సేవలు ఉండాలని చెప్పారు.
అంతే కాదు ఆరోగ్యం విద్య సంరక్షణ, వ్యవసాయం ఇలా అనేక కీలక రంగాలలో ఏఐ సేవలను ఉపయోగించుకోవాల్సిన దాని గురించి కూడా చర్చ జరగాలని అన్నారు. ఇక ఏఐ అంటేనే ఉన్న ఉద్యోగాలు పోవడం అన్న భయం ప్రపంచ సమాజంలో ఉందని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఆ భయం తప్పు అని ఏఐ వల్ల కొత్తగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు.
అయితే ఆయా ఉద్యోగాలను అందుకునే స్కిల్స్ ని నేర్చుకోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. చరిత్రలో చూస్తే ఏ కొత్త సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా కొత్త ఉపాధి అవకాశాలు రావడమే జరిగిందని కూడా ఆయన గుర్తు చేసారు. ఆ విధంగా చూస్తే కనుక ఏఐ వల్ల మేలు ఎక్కువగానే జరుగుతుందని ఉద్యోగాలు ఎగిరిపోతాయన్న భయాలు ఎవరూ పెట్టుకోవద్దు అని మోడీ సూచించారు.
ఇక చూస్తే కనుక మోడీ చెప్పిన దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. పక్షపాతంతో కూడిన ఇబ్బందులు వస్తాయని అన్నారు. అంటే ఏఐని ఎవరికి వారుగా వాడుకుంటూ ఇతర దేశాల ప్రయోజనాలకు భంగం కలిగించరాదు అన్నది అంతర్లీనంగా ఒక సందేశం ఉంది. అలాగే ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు అని కూడా మోడీ ప్రపంచానికి హెచ్చరించారు. ఏఐ అన్నది మన నియంత్రణలోనే ఉండాలి. అది ఒక దశ దాటి శృతి మించితే అపుడు ప్రమాదాలే జరుగుతాయన్నది మోడీ చేసిన హెచ్చరికగా చెబుతున్నారు.