Begin typing your search above and press return to search.

ప్రధానికి సహాయకుడు.. రూ.వందల కోట్లకు పడగలెత్తాడు!

అలాంటిది ప్రధానమంత్రి సహాయకుడు ఒకరు ఏకంగా రూ.284 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నాడు. ఇప్పుడిది బంగ్లాదేశ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   18 July 2024 12:30 PM GMT
ప్రధానికి సహాయకుడు.. రూ.వందల కోట్లకు పడగలెత్తాడు!
X

రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం చాలా సహజంగా మారిపోయింది. అధికారంలో ఉంటే సాధారణ నేతలు కూడా ఇవాళ్టి రోజుల్లో రూ.వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటిది ప్రధానమంత్రి సహాయకుడు ఒకరు ఏకంగా రూ.284 కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నాడు. ఇప్పుడిది బంగ్లాదేశ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

బంగ్లాదేశ్‌ లో షేక్‌ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆమెకు టీ, స్నాక్స్‌ అందించడానికి జహంగీర్‌ ఆలం అనే ఒక సహాయకుడు ఉన్నాడు. ప్రధానమంత్రిని కలవడానికి ఎవరైనా అతిథులు వస్తే వారికి తాగునీరు, టీ, స్నాక్స్‌ అందించడం అతడి బాధ్యత.

అతడు ప్రధాని పేరును వాడుకుని ఏకంగా రూ.284 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ దినపత్రిక ఢాకా ట్రిబ్యూన్‌ సంచలన కథనం ప్రచురించింది. షేక్‌ హసీనా సహాయకుడు జహంగీర్‌ ఆలంపై అనేక అవినీతి కేసులు ఉన్నాయని వెల్లడించింది. ప్రధాని కార్యాలయానికి, ఇంటికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి నుంచి అతడు భారీగా దండుకుంటున్నట్టు తెలిపింది. వివిధ కాంట్రాక్టులు ఇప్పిస్తానని, పనులు చేయిస్తానని పలువురి వద్ద భారీ మొత్తంలోనే లంచాలు వసూలు చేసినట్టు చెబుతున్నారు.

అంతేకాకుండా ఖరీదైన ప్రైవేటు హెలికాప్టర్లలో జహంగీర్‌ ఆలం ప్రయాణాలు సాగించేవాడని చెబుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ లో పలువురు అధికారులు, ఉన్నతోద్యోగుల అవినీతి బయటపడింది. వీరిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని సహాయకుడు జహంగీర్‌ ఆలం వ్యవహారం కూడా వెలుగుచూసిందని చెబుతున్నారు.

జహంగీర్‌ ఆలం తన పేరు చెప్పుకుని చేసే దందాలు ఇన్నాళ్లు ప్రధాని షేక్‌ హసీనాకు తెలియకపోవడం గమనార్హం. ఇప్పుడీ విషయం వెలుగుచూడటంతో అతడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఇప్పటికే జహంగీఆర్‌ ఆలం దేశం దాటిపోయాడని తెలుస్తోంది. అతడు అమెరికాకు బిచాణా ఎత్తేశాడని సమాచారం.

ఈ నేపథ్యంలో తన సహాయకుడి అవినీతి, అక్రమాలపై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా స్పందించారు. అతడి విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. తన సహాయకుడు వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ) తీవ్ర విమర్శలు చేశారు. ప్ర«ధాని సహాయకుడికే వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఇక ప్రధాని ఆస్తులు ఎంతో ఊహించలేమన్నారు. ప్రధానికి తెలియకుండా ఇదంతా జరిగిందని తాము భావించడం లేదన్నారు. ఇప్పటివరకు జహంగీర్‌ ఆలంను అరెస్టు చేయకపోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.