వాళ్లంతా చెత్త.. మేమే ఏరేద్దామనుకున్నాం.. వాళ్లే పోయారు
దీనిపై తాజాగా బీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 30 March 2024 2:45 AM GMTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి రాం రాం చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా కీలక సలహాదారు కేకే నుంచి ఆయన కుమార్తె వరకు పార్టీని వదిలేశారు. ఇక, ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఎంపీ టికెట్ ఇచ్చిన కడియం శ్రీహరి కుటుంబం కూడా కేసీఆర్ గూటిని వదిలేసింది. దీంతో బీఆర్ ఎస్‌లో అసలు ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగింది. దీనిపై తాజాగా బీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
''వాళ్లంతా చెత్త.. మేమే ఏరేద్దామనుకున్నాం.. వాళ్లే పోయారు'' అని పోచారం వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొంత మంది పోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ''వాళ్ల పార్టీకి ఏమైనా ఒరిగిందా? ఏ మాత్రమైనా జెండా మోశారా? కనీసం పార్టీ కోసం పదవులు వదులుకున్నారా? పార్టీ కోసం పది రూపాయలు ఖర్చు చేశారా? పదవులు అనుభవించారు. ఇప్పుడు అవకాశ వాదులుగా పోయారు'' అని పోచారం నిప్పులు చెరిగారు.
గట్టి వాళ్లు మాత్రమే ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీలో మిగిలారని పోచారం వ్యాఖ్యానించారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్‌దే అన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదని, కేసీఆర్ హవా మరింత పెరుగుతుందన్నారు. కారు ప్రస్తుతం సర్వీసింగ్‌కు మాత్రమే వెళ్లిందని తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని... బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెబుతామని... కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని.. కానీ, అనుకూల మీడియాలో కథనాలు, ప్రచారాలు చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.