పోచారానికి మంత్రి పదవి.. రేవంత్ క్లారిటీ ఇదే!
కానీ, ఇప్పుడు తనకు ద్రోహం చేసి వెళ్లిపోయారని.. మంత్రి పదవి కోసం ఆశపడ్డారని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 28 Jun 2024 2:45 PM GMTబాన్సువాడ ఎమ్మెల్యే, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. మంత్రి పదవికోసం ఆశపడి.. పోచారం పార్టీ మారారని.. తన సన్నిహితులతో మాజీ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. గతంలో ఎంతో మంది నాయకులు ఉన్నా.. వారందిరినీ పక్కన పెట్టి పోచారానికి స్పీకర్ పదవిని ఇచ్చినట్టు తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు ద్రోహం చేసి వెళ్లిపోయారని.. మంత్రి పదవి కోసం ఆశపడ్డారని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.
ఇక, ఈ విషయంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రేవంత్ స్పందిస్తూ.. గత డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫాంపై పోటీ చేసి విజయం దక్కించుకున్న వారికి మాత్రమే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో రెండో మాటకు అవకాశం లేదన్నారు. అంటే.. దీనిని బట్టి పోచారానికి మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశం లేదని రేవంత్ స్పష్టం చేసినట్టు అయింది. అదేసమయంలో బీఆర్ ఎస్ నుంచి వచ్చిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఏళ్ల తరబడి సేవ చేసిన వారు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం కొందరు లైన్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే.. ఈ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయ మే ఫైనల్ అని రేవంత్ వివరించారు. ఎవరైనా సరే పదవి ఆశించడం తప్పుకాదన్నారు. తెలంగాణలో వ్యవస్థలన్నీ పారదర్శకంగా నే ఉన్నాయన్న సీఎం.. ఎవరో చెప్పిన తప్పుడు మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. విద్యుత్ కోతలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. వాస్తవానికి విద్యుత్ కోతలు లేవని.. అంతరాయాలు మాత్రమే ఉన్నాయని తనదైన శైలిలో వ్యాఖ్యా నించారు. రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీ చేస్తారన్న ప్రచారాన్ని సైతం రేవంత్ కొట్టి పారేశారు. అదేమీ లేదన్నారు. అయితే.. విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.