మంత్రి పదవి వద్దంటున్న పోచారం.. కారణమిదే!
తాజాగా సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో కేసీఆర్‌కు పెద్ద షాక్ తగిలింది.
By: Tupaki Desk | 23 Jun 2024 2:30 PM GMTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చావుదెబ్బ కొట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సాగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. తాజాగా సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో కేసీఆర్‌కు పెద్ద షాక్ తగిలింది. ఎంతో అనుభవమున్న, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టున్న పోచారం రాక కచ్చితంగా కాంగ్రెస్‌కు మేలు చేసేదే. అలాంటి నాయకుడికి ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో రేవంత్ మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలిసింది. కానీ ఈ పదవిని పోచారం తిరస్కరించారని టాక్.
ఏ నాయకుడైనా తన స్వార్థం చూసుకునే పార్టీ మారతాడు. పదవి ఆశించో లేదా ఇంకేదో ప్రయోజనం కోసమో జంప్ అవుతారు. కానీ పోచారం మాత్రం మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న పోచారం కాంగ్రెస్‌లోకి రాగానే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే అది ప్రజల్లో నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సీనియర్ నేత కేవలం మంత్రి పదవి కోసమే పార్టీ మారారా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.
ఇక ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని, పదవుల ఎర చూపి తమ పార్టీ నాయకులను కాంగ్రెస్ లాక్కుంటుందని బీఆర్ఎస్ మరింతగా రెచ్చిపోయే అవకాశముంది. అందుకే తనకు, పార్టీకి చెడ్డ పేరు వద్దనే ఉద్దేశంతోనే పోచారం మంత్రి పదవిని తిరస్కరించారని టాక్. కానీ అలాంటి నాయకుడికి ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని రేవంత్ అనుకుంటున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.